టీమిండియా లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎక్కడకు వెళ్లినా ఫ్యాన్స్ కనబడుతూనే ఉంటారు. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న అతన్ని చూసిన ఒక ఎయిర్ హోస్టెస్ తన సంతోషాన్ని ఆపుకోలేకపోయింది. ఒక ట్రే నిండా చాక్లెట్స్ తీసుకెళ్లి ధోనీకి ఇచ్చింది.
ఆ సమయంలో భార్యతో కలిసి ప్రయాణిస్తున్న ధోనీ.. తన ట్యాబ్‌లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నాడు. ఎయిర్ హోస్టెస్ తనను పలకరించగానే గేమ్ పక్కన పెట్టిన ధోనీ ఆమెను నవ్వుతూ పలకరించాడు. తన చేతిలోని చాక్లెట్లు అన్నీ ఆమె ఇవ్వబోతే.. ఒక చిన్న ప్యాకెట్ తీసుకొని, తనకు అంత వరకు చాలని చెప్పాడు. వీళ్ల సంభాషణ వినిపించకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ పెట్టడంతో ఏం మాట్లాడుకున్నారో తెలియడం లేదు.

ఈ చాక్లెట్లతోపాటు ఆమె ఒక స్లిప్ కూడా ధోనీకి ఇచ్చింది. దానిలో ఏం రాసి ఉందో కూడా తెలియదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇదంగా జరిగింది ఎకానమీ క్లాస్ సీట్లలో అని చూస్తేనే తెలిసిపోతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఫ్యాన్స్.. 'స్టార్లు అందరూ బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తుంటే.. తల ధోనీ మాత్రం ఎకానమీ క్లాసులోనే ప్రయాణిస్తున్నాడు. సింప్లిసిటీ అంటే ఇది కదా' అంటున్నారు.
ఇక మరికొందరేమో ధోనీ అంతటి వాడు కూడా 'క్యాండీ క్రష్' ఆడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఈ వీడియో చూసిన తర్వాత క్యాండీ క్రష్ డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగిపోతాయి చూడండంటున్నారు. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోనీ మోకాలికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సర్జరీ సక్సెస్‌ఫుల్ అయిందని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఇటీవలే వెల్లడించారు.