
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ధోనీ సాధించిన విజయాలు అలాంటివి మరి. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈ మూడు ఐసీసీ అవార్డులు అందుకున్న ఏకైక కెప్టెన్ ధోనీ మాత్రమే. భారత క్రికెట్‌లో కెప్టెన్ అనే పదానికి మారుపేరుగా ధోనీ మారాడు. అంతర్జాతీయంగా కూడా ధోనీ కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ నైపుణ్యాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది.
రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు పలికాడు. దీంతో అతని పాపులారిటీ నెమ్మదిగా తగ్గిపోతుందని అంతా అనుకున్నారు. కానీ కేవలం ఐపీఎల్‌లోనే కనిపిస్తున్న ఈ లెజెండరీ కెప్టెన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇటీవలి కాలంలో మరింత రెట్టింపయింది. ఇటీవల వింబుల్డన్ మ్యాచులు చూసేందుకు లండన్ వెళ్లిన అతన్ని చూసేందుకు అక్కడి అభిమానులు ఎంతగా ఎగబడ్డారో చూస్తేనే ఈ విషయం అర్థం అవుతుంది. అలాగే భవిష్యత్తులో టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా ఎదుగుతున్న హార్దిక్ పాండ్యాతో కలిసి ధోనీ డ్యాన్స్ చేసిన వీడియో కూడా తెగ వైరల్ అయింది.
ఈ క్రమంలో ఇప్పుడు మరో వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారుతోంది. ఈ వీడియోలో ఒక అభిమానికి ధోనీని కలిసే అదృష్టం దక్కింది. ధోనీని చూడగానే సంతోషంలో మునిగిపోయిన అతను.. తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు.
ధోనీకి పెన్ ఇచ్చి వెనక్కు తిరిగి తన తెల్ల టీషర్ట్‌పై ఆటగ్రాఫ్ తీసుకున్నాడు. ఈ వీడియోను చూసిన అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ధోనీ వంటి లెజెండ్ ఆటోగ్రాఫ్ తీసుకున్న తర్వాత.. ఇక ఆ టీషర్ట్‌ను ఆ ఫ్యాన్ మళ్లీ ఉతుకుతాడా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.