నవ్వులు పూయించిన ధోని: అమ్ముడుపోని తాహిర్ సత్తా (ఫోటోలు)
హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా గురువారం పూణె, ముంబై జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పూణె జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ధోని ఈ మ్యాచ్‌లో సరదాగా రివ్యూ కోసం వెళ్లాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో భాగంగా తమ జట్టు లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ వేసిన బౌలింగ్‌లో ధోని రివ్యూ కోరాడు.
పొలార్డ్‌ని అవుట్ చేసేందుకు ధోని రివ్యూ అంటూ సైగ చేశాడు. నిజానికి ఐపీఎల్‌లో రివ్యూలు లేకపోయినా థర్డ్ అంపైర్ అంటూ ధోని సంకేతాలిచ్చాడు. తాహీర్ అప్పీల్‌కు అంపైర్ స్పందిచకపోవడంతో ధోని ఇలా చేసి నవ్వులు పూయించాడు. టీవీ రిప్లేలో అది అవుట్‌గా కనిపించినా, ఐపీఎల్లో డీఆర్ఎస్ లేకపోవడంతో పొలార్డ్ బతికిపోయాడు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా పూణెలో జరిగిన తొలి వన్డేలో ధోని తొందర్లో రివ్యూకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాడిగా ఉన్న ధోని పొరపాటున డీఆర్ఎస్ సంకేతాలిచ్చాడు. అంపైర్ నిర్ణయంపై సమీక్ష కోసం కెప్టెన్ అప్పీల్ చేయాల్సిన సమయంలో ధోని రివ్యూకు వెళ్లాడు.
అయితే ఈ సిరిస్‌కు ముందే ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఆడిన తొలి మ్యాచ్ కాబట్టి ధోని అలా తొందర్లో రివ్యూకు వెళ్లాడు. ఇదిలా ఉంటే గురువారం నాటి మ్యాచ్‌లో పూణె లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ అద్భుతమైన బౌలింగ్‌తో చెలరేగాడు.

సత్తా చాటిన తాహిర్
ముంబై ఇండియన్స్‌ను వణికిస్తూ తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పార్థీవ్ పటేల్(19), రోహిత్ శర్మ(3), జాస్ బట్లర్(38) వికెట్లను సాధించి ముంబైకు షాకిచ్చాడు. ముంబై ఇండియన్స్ మంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తాహీర్ అద్భుతమైన బౌలింగ్‌లో కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు చేర్చాడు.

పూణెదే పైచేయి
ఆఖరి ఓవర్ వరకూ నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌లో పూణె పైచేయి సాధించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, రహానే (34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు) మెరుపులు తోడవడంతో గురువారం ఇక్కడి ఎమ్‌సీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య పుణె ఏడు వికెట్లతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.

మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకున్న పూణె
ముంబై నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని పుణె మూడు వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలుండగానే ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 184 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 35 నాటౌట్), నితీష్ (34) రాణించారు.

తాహిర్ 3, రజత భాటియాకు 2 వికెట్లు
పూణె బౌలర్లలో తాహిర్ 3, రజత భాటియా 2 వికెట్లు తీశారు. స్మితకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ ఐపీఎల్ వేలంలో తాహీర్‌ను ఎవరూ కొనగోలు చేయని సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ఆరంభానికి కొన్ని రోజులకు ముందు నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న తాహిర్‌ను పూణె జట్టులోకి తీసుకుంది. జట్టు పెట్టుకున్న ఆశల్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు తాహిర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications