బెంగళూరు: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికే చాలా సాధించాడని, అంతర్జాతీయ క్రికెట్ ఆడాలా? వద్దా? అనేది అతనికే వదిలేయాలని బ్యాటింగ్ దిగ్గజం గుండప్ప విశ్వనాథ్ పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుంచి ధోనీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో విశ్వనాథ్ ధోనీకి మద్దతుగా నిలిచాడు.
'రిటైర్మెంట్ అనేది ఆటగాడి వ్యక్తిగత నిర్ణయం. దీనిపై ఎవరూ ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. టీమిండియాకు ఎంతో చేసిన అతనికి ఎప్పుడు రిటైర్ కావాలో తెలుసు. ఇండియా క్రికెట్‌ను కాలమే మారుస్తుంది' అని 66ఏళ్ల విశ్వనాథ్ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
'బిసిసిఐ లేదా సెలెక్టర్లు ఆటగాడి రిటైర్మెంట్‌పై ఏదైనా సంకేతం ఇస్తే.. అతడు దానిపై నిర్ణయం తీసుకుంటాడు. ఇది గతంలో జరిగిన విధంగా కాదు. ఒకసారి మంచిగా ఆడకపోతే అతడు మళ్లీ జట్టులోకి రావడం కష్టంగా ఉండేది' అని విశ్వనాథ్ పేర్కొన్నాడు.

అదే విధంగా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుకు విశ్వనాథ్ మద్దతు తెలిపాడు. కోహ్లీ ఏ పరిస్థితుల్లోనైనా మ్యాచ్ గెలవడంపైనే దృష్టి సారిస్తాడని చెప్పాడు. సునీల్ గవాస్కర్ టెస్ట్ మ్యాచ్ ఆడటంలో ఎక్స్‌పర్ట్ అని తెలిపాడు. 'ప్రస్తుతం కోహ్లీ యంగ్ కెప్టెన్.. అనుభవంతో అన్నీ నేర్చుకుంటాడు' అని తెలిపాడు. ప్రస్తుత ఆటగాళ్లలో మురళీ విజయ్ నిలకడగా రాణిస్తున్నాడని చెప్పాడు.
విరాట్ కోహ్లీ కాకుండా, అజింక్యా రహానే, మురళీ విజయ్‌లు చాలా బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా మురళీ ఎంతో ఏకాగ్రతతో ఆడతాడని, ఇంగ్లాండ్ పర్యటనలో అతను బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతమని చెప్పాడు.