ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో క్రికెట్ వర్గాల్లో ఓ పాత ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోనీకు ఉన్న అలవాట్ల గురించి తాజాగా ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ధోనీకి హుక్కా(షీషా) తాగా అలవాటు ఉందని గతంలోనే మైఖేల్ హస్సీ వంటి వారు చెప్పినప్పటికీ.. ధోనీ గదిలో ఈ సెటప్‌ను ఎవరు చూసుకునేవారో సామ్ బిల్లింగ్స్ తాజాగా వెల్లడించారు.
ఆ ఆటగాడే ధోనీకి 'షీషా మ్యాన్'
సామ్ బిల్లింగ్స్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ధోనీకి హుక్కా అంటే చాలా ఇష్టమని, ఆయన హోటల్ గదిలో ఎప్పుడూ హుక్కా సిద్ధంగా ఉండేదని తెలిపారు. అయితే ఆ హుక్కాను రెడీ చేసే బాధ్యతను ఓ యువ భారత ఫాస్ట్ బౌలర్ తీసుకునేవాడని.. ఆయన ధోనీకి 'షీషా మ్యాన్' అని బిల్లింగ్స్ చమత్కరించాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు.. టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్. ధోనీ రూమ్‌లో హుక్కా సెటప్‌ను పర్యవేక్షించడం ఖలీల్ అహ్మద్ పని అని బిల్లింగ్స్ నవ్వుతూ గుర్తు చేసుకున్నాడు.

ధోనీ గది ఎప్పుడూ తెరిచే ఉంటుంది..
ధోని వ్యక్తిత్వం గురించి చెబుతూ సామ్ బిల్లింగ్స్ మరిన్ని విశేషాలను పంచుకున్నాడు. ఎంఎస్ ధోని తన స్టార్‌డమ్ కారణంగా బయట తిరగలేరు కాబట్టి.. తన హోటల్ గదిని ఎప్పుడూ తెరిచే ఉంచుతాడని వెల్లడించాడు. యువ ప్లేయర్లు ఎవరైనా సరే సంకోచం లేకుండా ఆయన గదిలోకి వెళ్లొచ్చని.. అక్కడ కూర్చుని ధోనీతో క్రికెట్ ముచ్చట్లు లేదా ఇతర విషయాలు చర్చించవచ్చని సామ్ బిల్లింగ్స్ పేర్కొన్నాడు. తాను కూడా ధోనీతో కలిసి ఆయన గదిలో మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వీక్షించేవాడినని బిల్లింగ్స్ తెలిపాడు.
ధోనీ నాయకత్వ శైలి గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడని, అంతటి కూల్ వ్యక్తిని తాను ఇప్పటివరకు చూడలేదని బిల్లింగ్స్ ప్రశంసించాడు. సీఎస్కే జట్టులో ఓ సూపర్ స్టార్ హోదా ఉన్నప్పటికీ.. అందరితోనూ చాలా ఈజీగా కలిసిపోతాడని కొనియాడాడు. సామ్ బిల్లింగ్స్ 2018, 2019 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి, జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ధోనీకి సంబంధించిన ఈ 'హుక్కా' రహస్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ధోనీ మైదానంలో ఎంత క్రమశిక్షణతో ఉంటారో, బయట తన జట్టు సభ్యులతో అంత సరదాగా గడుపుతారని ఈ కామెంట్స్ మరోసారి నిరూపిస్తున్నాయి.