
130 పరుగుల లక్ష్యం కష్టం..
'ఎలాంటి వికెట్ అయినా సరే 130 పరుగుల కంటే తక్కువ ఉన్న లక్ష్యాన్ని కాపాడుకోవడం కష్టం. అయితే నేను మాత్రం మా బౌలర్లకు చెప్పింది ఒక్కటే. ఫలితం ఎలా ఉన్నా సరే మీ సత్తా ఏంటో చూపించండి. సాయశక్తులా పోరాడండని చెప్పాను. యువ ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. పరిస్థితులతో సంబంధం లేకుండా రాణించగలమనే ఆత్మవిశ్వాసాన్ని కనబర్చారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇలాంటి అటిట్యూడే కావాలి. అయితే గత కొన్నేళ్ల క్రితం బెంచ్‌పై ఫాస్ట్ బౌలర్ల కొరత ఉండేది. అప్పటి పేస్ బౌలర్లు సైతం మెచ్యూర్ అవ్వడానికి టైమ్ తీసుకునేవారు. కానీ ఐపీఎల్ కారణంగా చాలా మంది పేసర్లు అందుబాటులోకి వచ్చారు. ఈ టోర్నీ కారణంగా వారి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతోంది.

ఆ ఇద్దరు సూపర్..
సిమ్రన్ జిత్ సింగ్, ముఖేష్ చౌదరి అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఇద్దరి సూపర్బ్ బౌలింగ్ వచ్చే ఏడాది మాకు కలిసొచ్చే అంశం. ముందుగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తీవ్ర ఒత్తిడి ఉంటే ముందుగా ఎదుర్కొనే బంతులు చాలా కీలకం. కానీ ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కొంతమంది బ్యాటర్లు అద్భుత బంతులకు ఔటయ్యారు. అయితే ప్రతీ మ్యాచ్‌తో వారు గుణపాఠం నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నా.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

చెన్నై చిత్తు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై ముంబై బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ముంబై ఇండియన్స్ 14.5 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. తెలుగు తేజం తిలక్ వర్మ(32 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్) కడవరకు నిలిచి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. చెన్నౌ బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు వికెట్లు తీయగా.. సిమ్రన్ జిత్ సింగ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యఛేదనలోనూ ముంబై ఇండియన్స్ తడబడింది.