
హైదరాబాద్: ధోనీకి వింత ప్రశ్న ఎదురైంది. టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్ తరపున పాల్గొన్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తోన్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఎలా ఉందని ధోనీని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ధోనీ వెంటనే బదులిచ్చాడు. వన్డే, టీ20 క్రికెట్‌లో కోహ్లీ కెప్టెన్ అయినా సీనియర్ అయిన ధోనీ నుంచి ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుంటూ విజయవంతం అవుతున్నాడు.
ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్ ఆడేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ ఢిల్లీ చేరుకుంది. ఈ నేపథ్యంలో చెన్నై ఆటగాళ్లు అభిమానులతో ఏర్పాటు చేసిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆటగాళ్లు జవాబులు చెప్పారు. ఈ క్రమంలో ఓ అభిమాని 'కోహ్లీ కెప్టెన్సీ ఎలా ఉంది?' అని ధోనీని అడిగారు. వెంటనే ధోనీ 'వెరీగుడ్' అని బదులిచ్చాడు.
అతను సమాధానం చెప్పిన తీరుకు అక్కడి వాతావరణమంతా హర్షంతో నిండిపోయింది. అంతకుముందు మరో అభిమాని 'కెప్టెన్సీని ఇష్టపడతారా లేదంటే జట్టులో సాధారణ ఆటగాడిలా ఉండటం ఇష్టమా?' అని అడగ్గా 'ముందుగా సాధారణ ప్లేయర్‌గా ఉండటం ప్రతి ఆటగాడికి ఎంతో ముఖ్యం. అప్పుడే ఆటను, ఆటగాళ్లను అర్థం చేసుకోగలం. ఇంకా ఎన్నో నేర్చుకోవచ్చు' అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో ధోనీతో పాటు జడేజా, హర్భజన్‌సింగ్, రైనా, బ్రావో కూడా పాల్గొన్నారు.
ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ ఈ సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్ చేరుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై ఈ రోజు ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి అగ్రస్థానానికి వెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది. మరో పక్క ఇప్పటికే ప్లేఆఫ్ రేసుపై ఆశలు వదులుకున్న ఢిల్లీ స్వేచ్చతో కూడిన ఆటతీరు ప్రదర్శిచేందుకు సిద్ధమైంది.