హైదరాబాద్: బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని ఆశ్చర్యకరంగా సులువైన స్టంపింగ్‌ని మిస్ చేశాడు. ఇన్నింగ్స్ 23వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్‌లో ఓపెనర్ అరోన్ ఫించ్ బంతిని హిట్ చేసేందుకు క్రీజు వదిలి వెళ్లాడు.
అయితే బంతిని అతని బ్యాట్‌కు తగలకుండా వెనక్కి వెళ్లింది. వికెట్ల వెనుకన ఉన్న ధోని బంతిని అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అది వేగంగా బౌండరీ లైన్‌ని తాకింది. ఈ సమయంలో ఆరోన్ ఫించ్ 57 బంతుల్లో 47 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఈ క్రమంలో చాహల్ విసిరిన ప్లైటెడ్ డెలివరీ పిచ్ మీద పడిన తర్వాత బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని బంతి లెగ్ వికెట్ పక్క నుంచి వెనక్కి వెళ్లింది. అయితే ఆ బంతి అందుకోవడంలో ధోని విఫలమవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిని సద్వినియోగం చేసుకున్న ఫించ్ నాలుగో వన్డేలో రెచ్చిపోయి ఆడాడు.
భారత బౌలర్లను లక్ష్యంగా చేసుకుని ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. 96 బంతుల్లో 94 పరుగులు చేసి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. భారత్ తరుపున 305 వన్డే మ్యాచ్‌లాడిన ధోని ఇప్పటి వరకు 103 స్టంపౌట్స్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.