హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వన్డే చరిత్రలోనే ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. వన్డేల్లో 100 స్టంపౌట్స్ చేసిన ఏకైక వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లంక బ్యాట్స్‌మెన్ ధనంజయని స్టంపౌట్ చేయడం ద్వారా ధోని ఈ రికార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

లంక ఇన్నింగ్స్ లో భాగంగా 45 ఓవర్ చివరి బంతికి దనంజయను ధోని స్టంపింగ్ చేశాడు. చాహల్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ కోసం ధనంజయ ప్రయత్నించాడు. అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి నేరుగా ధోని చేతుల్లోకి వెళ్లింది. క్షణాల వ్యవధిలోనే ధోని వికెట్లను గీరాటేయడంతో అతని ఖాతాలో వంద స్టంపౌట్స్ చేరాయి. దీంతో వన్డే క్రికెట్‌లో 100 స్టంపింగ్‌లు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు.
ధోని 100వ స్టంపింగ్ అంటే ఇటీవల నమోదు అయింది కాబట్టి అందిరికీ తెలుసు. అయితే ధోని మొట్టమొదటి స్టంపౌట్ చేసింది ఎవరిని అంటే కాస్త ఆలోచించాల్సిందే. ధోని మొట్టమొదటి స్టంపౌట్ బాధితుడు మరెవరో కాదు బంగ్లాదేశ్ క్రికెటర్ రాజిన్ సల్హే. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ధోని తన తొలి స్టంపింగ్‌ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ బౌలింగ్‌లో చేయడం విశేషం.

తాజాగా ధోని 100 స్టంపింగ్‌ల రికార్డుపై రాజిన్ స్పందించాడు. '2004లో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించింది. ఢాకాలో చివరి వన్డే జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 347 పరుగులు చేసింది. అనంతరం బంగ్లా బ్యాటింగ్‌కి దిగింది. 34వ ఓవర్ వేసేందుకు సచిన్ తెందుల్కర్ బంతిని అందుకున్నాడు. అప్పటికే బంగ్లా 5 వికెట్లు కోల్పోయింది' అని అన్నాడు.
'ఆ ఓవర్లో సచిన్ వేసిన ఐదో బంతిని ఎదుర్కొనే క్రమంలో నేను స్టంపౌట్ వెనుదిరిగాను. అప్పుడు నా వ్యక్తిగత స్కోరు 82. మెరుపు వేగంతో ధోనీ నన్ను స్టంపౌట్ చేశాడు. సెంచరీ చేజారినందుకు చాలా బాధపడ్డాను. రెప్పపాటు సమయంలో నన్ను అవుట్ చేసిన ధోనీ వేగం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ధోనీ తన కెరీర్లో 100 స్టంపౌట్లు సాధించడం పట్ల ఎంతో ఆనందంగా ఉంది' అని రాజిన్ పేర్కొన్నాడు.