బెంగళూరు: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవా రోజు రోజుకు ప్రముఖ సెలబ్రిటీ అయిపోతోంది. ప్రతీ రోజూ ఈ మూడు నెలల చిన్నారి ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. కాగా, ఆమె తండ్రి కెప్టెన్ కూల్ ఆమెకు సంబంధించిన మరో కొత్త ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
ఆ ఫొటోలో ఆమె తన తండ్రి చేతుల్లో ఆనందంగా కనిపిస్తోంది. బుధవారం(ఏప్రిల్ 22న) బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో గెలిచిన అనంతరం ధోనీ తన టీం డ్రెస్సింగ్ రూంలో ఆమెతో ఈ ఫొటోను దిగాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచులో బెంగళూరుపై చెన్నై 27 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

కాగా, జీవాతో ధోనీ తన ఆనందాన్ని పంచుకుంటూ దిగిన ఫొటోలు చాలానే ఉన్నాయి. ధోనీ-సాక్షిలకు జీవా తొలి సంతానం. ఆస్ట్రేలియాలో 2015 ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలోనే ఫిబ్రవరిలో జీవా జన్మించింది.
ఇటీవల ధోనీ మాట్లాడుతూ.. 'జీవా పుట్టినప్పుడు నేను ఇండియాలో లేను. ఆమెను చూడలేకపోయాను. అది నాకు కష్టమైన కాలం' అని ధోనీ చెప్పాడు. 'నేను నా దేశం తరపున ఆడతున్నాననీ గానీ లేదా చెన్నై లాంటి మంచి ఫ్రాంఛైజీ తరపున ఆడుతున్నాననేది తనకు అవసరం లేదు. ఆమె ఏడవాలనుకుంటే ఏడ్చేస్తుంది. అది నాకు మంచి అనుభూతినిచ్చింది' అని తన ముద్దుల కూతురు గురించి ధోనీ తెలిపాడు.