హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీసేన వెస్టిండిస్ పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్ కోసం ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా అటు నుంచి అటే నేరుగా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లింది.
తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, ఆదివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండిస్‌పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. జూన్ 30న ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది.
మూడో వన్డే కోసం టీమిండియా ఆంటిగ్వాకు చేరుకుంది. ఈ క్రమంలో టీమిండియా ఓపెన్ శిఖర్ ధావన్, మాజీ కెప్టెన్ ధోని కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో ఆంటిగ్వా బయలుదేరారు. ధోనీ భార్య సాక్షి, కుమార్తె జీవాతో పాటు, ధావన్ భార్య, కుమారుడు జోరావర్ ఈ బస్సులోనే ప్రయాణించారు.
ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను శిఖర్ ధావన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'ఆంటిగ్వాకు వెళ్తున్నాం. చిన్నారులు ఆడలాడుతూ అందరి ముఖాల్లో నవ్వులు తెప్పించారు' అని ఫోటోకి కామెంట్ పెట్టాడు.
అంతకముందు ధోని భార్య సాక్షి కూడా తన ఇనిస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఇద్దరు చిన్నారులతో దిగిన ఫోటోని పోస్టు చేసింది. 'మై టూ బాయ్స్' అన్న టైటిల్‌తో ధోని భార్య సాక్షి పంచిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న ఇద్దరూ ఎవరని అనుకుంటున్నారా? ఆదివారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు వెస్టిండిస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఇంటికి విందుకి వెళ్లారు. ఆ సమయంలో ధావన్, బ్రావో కుమారులతో సాక్షి కలిసి దిగిన ఫొటో ఇది.