16 ఏళ్ల తర్వాత: వన్డేల్లో ధోని అత్యంత 'చెత్త' రికార్డు
హైదరాబాద్: ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని అర్ధసెంచరీ చేయడానికి తీసుకున్న బంతులు 108. విండిస్‌తో జరిగిన ఈ నాలుగో వన్డేలో రహనే, ధోనీలు అతి జాగ్రత్తకు పోయి మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. లక్ష్యం స్వల్పమే అయినా, భారత బ్యాట్స్‌మెన్ మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆడలేకపోయారు.
ఈ మ్యాచ్‌లో ప్రత్యేకించి ధోని బ్యాటింగ్ అత్యంత జిడ్డుగా సాగింది. ఎంతలా అంటే గత గత పదహారేళ్లలో టీమిండియా తరపున ఇంత చెత్తగా ఆడిన బ్యాట్స్‌మన్ మరొకరు లేనంతగా. అంతేకాదు తన బ్యాటింగ్ తీరుతో మహేంద్ర సింగ్ ధోని తన ఖాతాలో ఓ చెత్త రికార్డుని కూడా వేసుకున్నాడు.

114 బంతుల్లో 54 పరుగులు చేసిన ధోని
ఈ మ్యాచ్‌లో ధోని 46 ఓవర్ వరకు ఎంతో నిదానంగా.. మరెంతో ఓపిగ్గా ఆడిన 114 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో అర్ధసెంచరీని సాధించడానికి ధోనికి 108 బంతులు అవసరమయ్యాయి. దీంతో ధోని తన పేరు మీద ఓ చెత్త రికార్డుని మూటగట్టుకున్నాడు. వన్డేల్లో అత్యంత నెమ్మదిగా అర్ధ సెంచరీని చేసిన భారత బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా నిలిచాడు.

శఠగోపన్ రమేశ్ తర్వాత ధోనియే
1999లో కెన్యాపై ఆడిన ఓ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ శఠగోపన్ రమేశ్ వన్డేల్లో అత్యంత నెమ్మదిగా అర్ధ సెంచరీని చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2005లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 105 బంతుల్లో అర్ధసెంచరీని నమోదు చేశాడు.

108 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన ధోని
తాజాగా వెస్టిండిస్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ధోని 108 బంతుల్లో అర్ధ సెంచరీని సాధించి గంగూలీ నమోదు చేసిన చెత్త రికార్డుని సైతం అధిగమించి వన్డేల్లో అత్యంత నెమ్మదిగా అర్ధ సెంచరీని చేసిన భారత బ్యాట్స్‌మన్‌లలో రెండో స్ధానంలో నిలిచాడు. తద్వారా గత పదహారేళ్లలో భారత్ తరపున ఇంత నెమ్మదిగా, ఇన్ని బంతుల్లో అర్ధసెంచరీని చేసిన ఆటగాడిగా ధోని నిలిచాడు.

పోరాడి ఓటమి పాలైన టీమిండియా
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. ఒకవైపు టపటపా వికెట్లు పడుతున్నా.. మరోవైపు క్రీజులో ధోనీ ఉండటంతో చివరివరకు టీమిండియా గెలుపు ధీమాతో ఉంది. కానీ, ధోనీ ఈ పిచ్‌పై పరుగులు రాబట్టడం గగనమైంది. సింగిల్స్ కూడా కష్టమైన దశలో ధోనీ 49వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు.

11 పరుగుల తేడాతో విండిస్ విజయం
లక్ష్యఛేదనకు ఏడు బంతులకు 14 పరుగులు చేయాల్సిన దశలో ధోని అవుట్ కావడంతో వెస్టిండీస్ విజయం ఖాయమైంది. ధోని అవుటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. 49.4 ఓవర్‌లో 178 పరుగులకు భారత్ ఆలౌటైంది. దీంతో కోహ్లీసేనపై వెస్టిండిస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2-1తో భారత్ ఆధిక్యంలో ఉంది. చివరి వన్డే జులై 6న కింగ్‌స్టన్‌లో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications