హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాజీ కెప్టెన్ ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. పల్లెకెలె వేదికగా జరిగిన రెండో వన్డేలో పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో కలిసి ధోని టీమిండియాకు అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఎనిమిదో వికెట్‌కు అజేయంగా వంద పరుగులు జోడించిన ఈ జోడీ ఊహించని విధంగా విజయాన్ని సాధించిపెట్టారు. ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చినా... ఆ తర్వాత మిడిలార్డర్ విఫలం కావడంతో టీమిండియా వరుస వికెట్లను కోల్పోయింది.

ఈ క్రమంలో ధోని తన అనుభవంతో క్రీజులో పాతుకుపోవడంతోపాటు బౌలర్ అయిన భువీని చక్కగా గైడ్ చేస్తూ భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ధోనిని బెస్ట్ ఫినిషర్ అని ఎందుకు అంటారో ఈ మ్యాచ్‌తో మరోసారి నిరూపించాడు.
ధోని ఇన్నింగ్స్ అభిమానులతో పాటు కోచ్ రవిశాస్త్రినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో రవిశాస్త్రి ధోనీపై ప్రశంసలు కురిపించాడు. 'అనుభవం అనేది మార్కెట్‌లో కొనేదో, అమ్మేదో కాదు' అని ధోనీ ఫొటోను పోస్ట్ చేసి రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ధోనీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.