టీమిండియా లెజెండ్, ఐపీఎల్ సూపర్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొంత ఇబ్బంది పడ్డాడు. టోర్నీ ఆరంభం నుంచే మోకాలి నొప్పితో తంటాలు పడ్డాడు. నీ క్యాప్స్ వేసుకొని ప్రాక్టీస్ చేశాడు. చివరకు తనదైన కెప్టెన్సీతో జట్టుకు మరో ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. అంతేకాదు, మోకాలి నొప్పి ఇబ్బంది పెడుతున్నా ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వలేదు.
ధోనీ వయసు 41 సంవత్సరాలు. ఈ వయసులో మోకాలి నొప్పితో అతను ఇబ్బంది పడటంలో వింతేం లేదు. కానీ తన ఇబ్బంది గురించి ధోనీ ఎవరితోనూ ఒక్క మాట కూడా చెప్పలేదట. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. అంతేకాదు ధోనీ ఆడతాడా? లేదా? అనే విషయంలో మేనేజ్‌మెంట్ ఎప్పుడూ ధోనీని ప్రశ్నించలేదని చెప్పాడు.

అదే సమయంలో ఆడటం ధోనీకి కష్టంగా ఉందని తమకు అర్థమైందని విశ్వనాథ్ అన్నాడు. అలా చూసుకుంటే ఒక్క మ్యాచ్ కూడా వదలకుండా ఆడినందుకు ధోనీని మెచ్చుకోవాలన్నాడు. 'ఆడతావా? లేదంటే రెస్ట్ తీసుకుంటావా? అని ధోనీని మేం ఎప్పుడూ అడగలేదు. తను ఆడలేకపోతే.. ధోనీ కచ్చితంగా మాకు చెప్పేస్తాడు. తనకు ఇబ్బందిగా ఉందని మాకు తెలుసు. కానీ టీం కోసం అతని కమిట్‌మెంట్ అలాంటిది' అని చెప్పాడు.
'ధోనీ నాయకత్వం జట్టుకు ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే. అలా చూసుకుంటే అతన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే. అంతేకాదు, ఫైనల్ ఆడే వరకు తన మోకాలు ఎంత బాధగా ఉన్నదీ ధోనీ ఎవరికీ చెప్పలేదు. అందరికీ అతని ఇబ్బంది తెలుస్తూనే ఉంది. పరిగెత్తలేకపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ తను మాత్రం ఒక్కసారి కూడా నొప్పిగా ఉందని ఎవరితో అనలేదు' అని విశ్వనాథ్ వెల్లడించాడు.
'ఫైనల్ అయిపోయిన తర్వాత మాత్రం.. నేను సర్జరీ చేయించుకుంటా అని చెప్పాడు. సర్జరీ ముగిసిన తర్వాత సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు రికవర్ అవుతున్నాడు' అని తెలిపాడు. అలాగే వచ్చే సీజన్‌లో ధోనీ ఆడతాడా? లేదా? అనే విషయాలను మేనేజ్‌మెంట్ అతన్ని అడగదని విశ్వనాథ్ తేల్చి చెప్పాడు. ఇలాంటివి ఏవైనా ఉంటే.. ధోనీ ముందుగా సీఎస్‌కే ఓనర్ శ్రీనివాసన్‌కు ఫోన్ చేసి ముందుగా చెప్తాడని పేర్కొన్నాడు.