2008లో పోలీసులతో దెబ్బలు.. 2021లో పక్కా ప్లాన్! 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎంఎస్ ధోనీ కలిసిన అభిమాని!

హైదరాబాద్: ఎంఎస్ ధోనీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకడు. టీమిండియాకు తిరుగులేని విజయాలు ఎన్నో అందించాడు. మహీ తన కెరీర్ ఆరంభం నుంచి బ్యాటింగ్, కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. దీంతో ధోనీకి కేవలం భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. అయితే ఫాన్స్ తన ఆరాధ్య క్రికెటర్‌ను కలుసుకోవడానికి ఆరాటపడుతుంటారు. కొందరు అభిమానులు మ్యాచ్ జరుగుతున్న సమయంలో బారికేడ్లను దాటి మహీ పాదాలను తాకి సంబరపడిపోతుంటారు. మరికొందరు మాత్రం మహీ ఆటోగ్రాఫ్ కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తుంటారు. దేవ్ అనే ఓ వ్యక్తి 13 ఏళ్లుగా ధోనీ కోసం ఎదురుచూశాడు.

ధోనీతో ఫొటో దిగడంతో పాటు:
దేవ్ అనే వ్యక్తి ఎంఎస్ ధోనీకి వీరాభిమాని. ఒక్కసారైనా మహీని నేరుగా కలిసి.. ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్నది అతడి చిరకాల కోరిక. దీనికోసం 2008లో ఓసారి ట్రై చేసి విఫలమయ్యాడు. అప్పటినుంచి అతడికి మరో అవకాశం రాలేదు. ఇక ఐపీఎల్ 2021 వాయిదా పడడంతో ప్రస్తుతం ధోనీ కుటుంబంతో సహా హిమాచల్ ప్రదేశ్‌లోని రత్నారి అనే ప్రాంతంలో విహారయాత్రకు వచ్చాడు. రత్నారీలోని మీనాభాగ్ హోటల్‌లో మహీ బస చేస్తున్నాడు. అదే హోటల్ మరో బ్రాంచీలో పనిచేస్తున్న దేవ్.. ఈ విషయం తెలుసుకున్నాడు. తనను సిమ్లా నుంచి రత్నారీ బదిలీ చేయాల్సిందిగా హోటల్ పై అధికారులను కోరాడు. దేవ్ అభ్యర్థనను వారు మన్నించడంతో అతడు రత్నారీ బ్రాంచీలో చేరి మహీని కలుసుకున్నాడు. ధోనీతో ఫొటో దిగడంతో పాటు తన ఫోన్ కవర్‌పై ఆటోగ్రాఫ్ కూడా తీసుకుని ఆనందపడిపోయాడు.

పోలీసులతో దెబ్బలు:
'ఎంఎస్ ధోనీకి దగ్గరుండి సపర్యలు చేసేందుకు దేవ్ అనే మా సిబ్బంది ఒకరు సిమ్లాలోని మీనాబాగ్ హోటల్స్ నుంచి రత్నారిలోని మీనాబాగ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. 2008లో ధోనీ ఒకసారి క్రికెట్ టోర్నీలో భాగంగా హిమాచల్‌కు వచ్చినప్పుడు దేవ్ ఎలాగైనా కలవాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసులతో దెబ్బలు తిన్నాడు. అప్పటినుంచి అతడికి మరో అవకాశం రాలేదు. ఇప్పుడు తనకిష్టమైన మహీని కలిసేందుకు సిమ్లా నుంచి ఇక్కడికి ఉద్యోగ మార్పు చేసుకున్నాడు. ధోనీని కలిశాక తన ఫోన్ కవర్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు' అని మీనాబాగ్ హోటల్ యాజమాన్యం ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.
ఐపీఎల్ ద్వారా అభిమానులను అలరిస్తున్నాడు:
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గతేడాది ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల బాదాడు. ఐపీఎల్ టోర్నీలో మహీ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు.

అత్యంత విజయవంతమైన కెప్టెన్:
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఎంఎస్ ధోనీ ఒకడు. టీమిండియాకు తిరుగులేని విజయాలు ఎన్నో అందించాడు. టెస్టుల్లో టీమిండియాను అగ్రస్థానంలో నిలపడంతో పాటు.. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు అందించాడు. క్రికెట్ చరిత్రలో ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీ మాత్రమే. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు టైటిల్స్ అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications