
హైదరాబాద్ : డీఆర్ఎస్‌ను కోరడంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని దిట్ట. కోరాడంటే ఖచ్చితంగా తనకు అనుకూలంగానే నిర్ణయం వస్తుందని క్రికెట్ అభిమానుల అంచనా. కానీ, ఇప్పుడు లెక్క కాస్త తప్పింది. ధోనీ కూడా పొరబాటు పడ్డాడు. మొదటి వన్డేలో డీఆర్ఎస్ కోరి సక్సెస్ అయిన ధోనీ మూడో వన్డేలో కోరకుండా ఉండి తప్పే చేశాడు.
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక బౌలింగ్‌లో ఉంది. క్రీజులో ధోనీ, జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు. నాన్ స్టైకర్ ఎండ్‌లో ఉన్న ధోని డీఆర్‌ఎస్‌కు వెళ్లి సక్సెస్ అయ్యాడు. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న జస్ప్రిత్ బూమ్రాను అంపైర్ ఔట్‌గా పరిగణించాడు. అది ప్రకటించడానికి చేతిని ఎత్తబోయాడు. ఈ క్రమంలోనే ఏమాత్రం తడబాటు లేకుండా ధోని రివ్యూను కోరాడు. తన అంచనా నిజమని రుజువు చేసుకున్నాడు.
ఆదివారం మూడో వన్డేలో అదే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోని అంచనా తప్పింది. టాస్ అనంతరం బ్యాటింగ్ తీసుకున్న శ్రీలంక ఆటగాళ్లు క్రీజులో ఉన్నారు. 14 ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ వేశాడు. అందులో నాలుగో బంతిని లంక ఆటగాడు సదీరా సమరవిక్రమ ఫ్రంట్ ఫుట్‌లో ఆడేందుకు ప్రయత్నించాడు. ఆ బంతి బ్యాట్ నుంచి దాటుకుని అతని కాలిని తాకింది. దానికి ధోనితో పాటు స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మలు గట్టిగా ఎల్బీకోసం అప్పీలు చేశారు. అంపైర్ నాటౌట్ అన్నాడు.
దానికి రివ్యూకి వెళ్దామా అంటూ ధోనిని స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ అడిగాడు. దానికి కాసేపు ఆలోచించిన ధోని వద్దనే సలహా ఇచ్చాడు. అయితే ఆ బంతి నేరుగా లెగ్ స్టంప్‌ను ఎగరేసుకుపోతున్నట్లు రిప్లయ్‌లో కనబడింది. అయితే భారత్ రివ్యూకు వెళ్లకపోవడం, ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో సమరవిక్రమ బతికి పోయాడు.
15 పరుగుల వద్ద ఉన్న సమరవిక్రమం 42 స్కోరుగా ఉన్నప్పుడు ఔటయ్యాడు. ఉపుల్ తరంగాతో కలిసి సెంచరీ పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. టీమిండియా కెప్టెన్సీ పదవి నుంచి ఎంఎస్ ధోని ఎప్పుడో తప్పుకున్నా ఫీల్డ్‌లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు అతన్ని ముందుగానే సంప్రదిస్తారు. లంకేయులతో మూడో వన్డేలో ధోని అంచనా తప్పింది. ఇటీవల కాలంలో డీఆర్‌ఎస్ విషయంలో ధోని అంచనా తప్పడం దాదాపు ఇదే 'తొలిసారి'.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.