న్యూఢిల్లీ: న్యూజిలాండ్ సిరిస్ అనంతరం టీమిండియా ఆటగాళ్లకు కాస్తంత విరామం దొరికింది. దీంతో కుటుంబ సభ్యులతో క్రికెటర్లు సరదాగా గడుపుతున్నారు. అంతేకాదు వరుస పర్యటనలతో తీరిక లేకుండా గడిపిన ఆటగాళ్లు ఇప్పుడు తమకు లభించిన విరామ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తున్నారు.
దీపావళికి ఒకరోజు ముందే న్యూజిలాండ్‌తో సిరిస్ ముగియడంతో టీమిండియా జట్టు ఆటగాళ్లంతా తమ తమ కుటుంబ సభ్యులతో కలిగి పండగ చేసుకున్నారు. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ధోని ఆదివారం స్నేహితులతో కలిసి తన ఇంట్లో దీపావళి సంబరాలు చేసుకున్నాడు.
పండుగ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇక ఈ దీపావళి ఇంట్లో కుటుంబసభ్యులతో జరుపుకోవడం పట్ల రహానే ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాదు తన భార్యతో కలిసి దిగిన ఫొటో ఇన్ స్టామ్‌లో పోస్టు చేసి అందరికీ దీపావళి విషెస్ చెప్పాడు.
ఇక హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు దీపావళి శుభాకంక్షలు తెలిపారు. కాగా, ఈ దీపావళికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే విదేశీ క్రికెటర్లు కూడా దీపావళి జరుపుకున్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ తన పిల్లలతో పాటు తాను కూడా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి పండగ చేసుకున్నాడు. తన భార్య, పిల్లలతో కలిసి ఉత్సాహంగా దీపావళి జరుపుకున్నామని వెల్లడించాడు.