చెన్నై: మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి, భారత దేశం మొత్తానికి రాజు అని వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ అన్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల పైన రెండేళ్ల పాటు వేటు పడిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

పై రెండు జట్లు 2018లో తిరిగి ఐపీఎల్‌లోకి రానున్నాయి. ప్రస్తుతం ధోనీ రైజింగ్ పుణే సుపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. ఆ జట్టుకు కూడా అతనే కెప్టెన్. అయితే, ధోనీకి చెన్నైతో ఎనిమిదేళ్ల బంధం ఉంది. దీంతో చెన్నైతో పాటు చాలామంది ధోనీ ఆ జట్టు తరఫున మళ్లీ ఆడితే చూడాలనుకుంటున్నారు. క్రిస్ గేల్ కూడా అదే కోరుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో, తమిళనాడు ప్రీమియర్ లీగ్ వెబ్ సైట్‌తో గేల్ మాట్లాడుతూ.. ధోనీ చెన్నైతో పాటు భారత దేశానికి కింగ్ అన్నాడు. అతను తిరిగి చెన్నై తరఫున ఆడుతాడని అభిప్రాయపడ్డాడు. క్రిస్ గేల్ రెండు రోజుల చెన్నై పర్యటనకు ఇటీవల వచ్చాడు. గేల్ తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించాడు. అదే సమయంలో క్రిస్ గేల్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ పైన ప్రశంసలు కురిపించాడు.