హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా ధోని ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని తాజాగా మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మహేంద్ర సింగ్ ధోని ఇప్పటివరకు 119 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మురళీధరన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.

వెస్టిండిస్‌తో గురువారం కింగ్ స్టన్ వేదికగా జరిగే ఆఖరి వన్డేలో కూడా నాటౌట్‌గా నిలిస్తే అత్యధిక మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ఏకైక ఆటగాడిగా ధోని చరిత్ర సృష్టిస్తాడు. ఇదిలా ఉంటే భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య ఆఖరి వన్డే జరుగుతున్న సబీనా పార్కు స్టేడియంలో గత 32 వన్డేల్లో విండీస్ 24 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. వరుసగా గత 9 మ్యాచ్‌ల్లో విండిస్ విజయం సాధించడం విశేషం.
అత్యధిక మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన టాప్-5 ఆటగాళ్లు:
మహేంద్ర సింగ్ ధోనీ(భారత్) - 119 సార్లు,
మురళీధరన్(శ్రీలంక)- 119 సార్లు,
షాన్ పోలాక్(దక్షిణాఫ్రికా)- 113 సార్లు,
చామిందా వాస్(శ్రీలంక)- 108 సార్లు,
స్టీవ్‌వా(ఆస్ట్రేలియా)- 104 సార్లు.