

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది చెన్నై సూపర్ కింగ్స్. గత సీజన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సీజన్ టైటిల్‌పైనా కన్నేసింది గానీ కాలం కలిసి రావట్లేదు.. పరిస్థితి అనుకూలించట్లేదు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా బోణీ కొట్టనేలేదు చెన్నై. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లల్లోనూ ఘోర పరాజయాలను చవి చూసింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్..రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఓడిపోయింది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ముంబై బ్రబౌర్స్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
రవీంద్ర జడేజా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు. అతనికి ఈ అవకాశం లభించడం ఇదే తొలిసారి. ఇదివరకు అటు జాతీయ జట్టులోనూ, ఐపీఎల్‌లో ఇతర ప్రాంఛైజీల్లోనూ సారథ్య బాధ్యతలను తీసుకున్న అనుభవం లేదు. ఇది అతనిపై వ్యక్తిగతంగా పెను ప్రభావాన్ని చూపిస్తోంది. కేప్టెన్‌గా రాణించట్లేదు.. సరికదా బౌలర్, బ్యాటర్‌గానూ విఫలమౌతున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లల్లో తన నాలుగు ఓవర్ల కోటాను కూడా పూర్తి చేయలేకపోయాడు. అతని బౌలింగ్‌లో భారీగా పరుగులు పిండుకున్నారు ప్రత్యర్థి బ్యాటర్లు.

ఈ రెండు ఓటముల తరువాత చెన్నై సూపర్ కింగ్స్ విమర్శలను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ పడుతున్నాయి. మహేంద్ర సింగ్ ధోనీని సైతం వదలట్లేదు ట్రోలర్స్. కేప్టెన్సీ పగ్గాలను వదులుకున్న తరువాత ధోనీ పని అయిపోయిందంటూ కామెంట్స్ చేస్తోన్నారు. ఈ సీజన్ తరువాత- ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకొంటాడని, అతనికి ఇదే చివరి ఐపీఎల్ అవుతుందంటూ వార్తలు సైతం వినిపిస్తోన్నాయి.
ఈ విమర్శలపై మహ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించాడు. ధోనీ కథ ఫినిష్ అయిపోయిందనుకునే వారి నోళ్లు త్వరలోనే మూతపడతాయనీ స్పష్టం చేశాడు. కేప్టెన్సీని కోల్పోయినంత మాత్రాన ధోనీ కేరీర్‌కు పుల్‌స్టాప్ పడినట్టు కాదని పేర్కొన్నాడు. తొలి రెండు మ్యాచ్‌లల్లో ధోనీ నాటౌట్‌గా నిలిచిన విషయాన్ని కైఫ్ గుర్తు చేశాడు. తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీతో సత్తా చాటాడని, రెండో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో 16 పరుగులు చేశాడని పేర్కొన్నాడు. దీన్ని బట్టి అతని ఫిట్‌నెస్‌పై గానీ, బ్యాటింగ్ శైలిపై గానీ అనుమానాలు అక్కర్లేదని తేల్చి చెప్పాడు. ఇంకొంతకాలం పాటు క్రికెట్ ఆడతాడని స్పష్టం చేశాడు. ధోనీ ఫినిషర్ తప్ప.. అతని కేరీర్ ఫినిష్ కాదని అన్నాడు.