
హైదరాబాద్: క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకరీతిలో.. దనాధన్ బౌండరీలు బాదేసి రికార్డులు సొంతం చేసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. 'ఎవరైనా కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారు. ధోని మాత్రం నిజమైన నాయకుడు''.. ఈ మాటలు చెప్తుంది ఎవరో కాదు టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా. ఓ వ్యాసంలో ధోని గురించి నెహ్రా ఈ వ్యాఖ్యలు చేశాడు.
'2005లో పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్‌లో మేం తొలిసారిగా కలిశాం. ఆ తర్వా గాయం కారణంగా మూడేళ్లు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత 2009 నుంచి మా మధ్య స్నేహం మొదలైంది. 2005 విశాఖపట్నంలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్ గంగూలీ.. ధోనీని మూడో స్థానంలో పంపితే అతను సెంచరీ బాది సత్తాచాటాడు. అదే ఏడాది శ్రీలంకపై 183 పరుగుల గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు.
ఆ ఘటనతో ధోనీలో మంచి ఆట ఉందని అందరూ ఓ నిర్దారణకి వచ్చారు. బంతిని సునాయసంగా మైదానం అవతలకు పంపించగలిగే ప్రత్యేక నైపుణ్యం అతనికుంది. ధోని టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పుడు సచిన్, ద్రవిడ్, గంగూలీ, సెహ్వాగ్, జహీర్‌ఖాన్, హర్భజన్ లాంటి దిగ్గజాలు జట్టులో ఉన్నారు. 27 ఏళ్ల వయసులోనే అలాంటి గొప్ప ఆటగాళ్లున్న జట్టును నడిపించడం మామూలు విషయం కాదు' అని నెహ్రా తెలిపాడు.
2007 టీ20 ప్రపంచకప్ గురించి చెబుతూ.. 'అప్పుడే ధోని కొత్తగా కెప్టెన్‌గా ఎంపికయ్యాడని గుర్తుంచుకోవాలి. అతను కెప్టెన్ కావడం భారత క్రికెట్‌ను మార్చేసింది. ధోని మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. భారత క్రికెట్ దిగ్గజాల జాబితాలో సచిన్, గవాస్కర్, ద్రవిడ్, కోహ్లితో పాటు ధోని కచ్చితంగా ఉంటాడు. అతను ప్రస్తుతం ఇంకా ఆటలో కొనసాగుతున్నాడు' అని నెహ్రా పేర్కొన్నాడు.
కాగా, ఇటీవల ప్రారంభమై సందిగ్ధ పరిస్థితుల్లో కొనసాగుతోన్న ఇంగ్లాండ్-ఇండియా సిరీస్‌లో టీ 20, వన్డే ఫార్మాట్‌లో ఆడిన ధోనీపై రిటైర్ అయితే బాగుంటుందంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఈ రెండు ఫార్మాట్లలో ధోనీ పెద్దగా రాణించలేకపోతున్నాడు. కాగా, ధొనీ అప్పుడే రిటైర్ అవడంటూ.. దానికి ఇంకా సమయం ఉందంటూ పలువురు దిగ్గజాలు పేర్కొంటున్నారు.