మాంఛెస్టర్‌కు 'చాచా చికాగో': మ్యాచ్ టికెట్లు పంపిన ధోనీ, ఆరువేల కిలోమీటర్లు ట్రావెల్!

లండన్: మహమ్మద్ బషీర్. ఈ పేరు చెబితే ఎవరూ పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు గానీ, చాచా చికాగో అనగానే..ఓ చేత్తో భారత త్రివర్ణ పతాకం, మరో చేత్తో పాకిస్తాన్ జెండా పట్టుకుని, అవే రంగు దుస్తులు ధరించి, పొడవాటి గెడ్డంతో క్రికెట్ స్టేడియంలో సందడి చేసే ఓ వృద్ధుడి రూపం మనకు ఛప్పున గుర్తుకు వస్తుంది. ఆయనే చాచా చికాగో. అమెరికాలో చికాగోలో స్థిరపడిన పాకిస్తాన్ జాతీయుడు. కరాచీలో జన్మించిన ఆయన చాలాకాలంగా చికాగోలో నివసిస్తున్నారు. అందుకే ఆయనకు చాచా చికాగోగా పిలుస్తారు అభిమానులు.

ధోనీకి వీరాభిమాని..
భారత్-పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ చోటు చేసుకున్నా, స్టేడియంలో ఆయన కనిపిస్తూంటారు. రెండు దేశాల క్రికెట్ జట్లను ఆయన ప్రోత్సహిస్తుంటారు. ఎవరో ఓడినా గెలిచేది మాత్రం క్రికెట్టే కదా! అనే ప్రాథమిక సూత్రాన్ని అనుసరిస్తుంటారాయన. జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీకి పే..ద్ధ అభిమాని. ఏజ్‌లో గానీ, అభిమానంలో గానీ ఆయన పెద్ద వారే. 2011 నాటి ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో తలపడిన భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ధోనీ అభిమానిగా మారిపోయారు. ఇన్నేళ్లయినప్పటికీ.. ధోనీ మీద ఆయనకు ఉన్న అభిమానం పెరిగిందే తప్ప, ఇసుమంతైనా తగ్గలేదు అది వేరే సంగతి.

చికాగో టు మాంఛెస్టర్..
అసలు విషయానికి వస్తే- ప్రపంచకప్ పోటీల్లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో తలపడే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించడానికి మాంఛెస్టర్‌కు చేరుకున్నారు చాచా చికాగో ఆలియాస్ మహమ్మద్ బషీర్. ఈ మ్యాచ్‌ను చూడ్డానికి ఆయన ఆరువేల కిలో మీటర్లు ప్రయాణించారు. చికాగో నుంచి మాంఛెస్టర్‌కు వచ్చారు. చికాగో నుంచి మాంఛెస్టర్‌కు రావాలంటే ఎంత లేదన్నా కనీసం 900 పౌండ్లను విమాన ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. మన భారతీయ కరెన్సీతో పోల్చుకుంటే దీని విలువ 79 వేల 250 రూపాయలు. రానూ, పోనూ లక్షన్నర రూపాయలకు పైమాటే ఖర్చవుతుంది. అయినప్పటికీ.. ఆయన మాంఛెస్టర్‌కు వచ్చారు.

మ్యాచ్ టికెట్లను పంపించిన ధోనీ
చాచా చికాగో.. చికాగో నుంచి మాంఛెస్టర్‌కు రావడానికి అవసరమైన ఛార్జీలు భారమే అయినప్పటికీ.. ధోనీని చూడ్డానికి ఆయన ఇంగ్లండ్‌కు వచ్చారు. మ్యాచ్ టికెట్లను స్వయంగా ధోనీయే ఆయనకు పంపించారు. ఈ విషయాన్ని బషీర్ స్వయంగా వెల్లడించారు. టికెట్లు దొరుకుతాయో, లేదో అని ఆందోళనకు గురయ్యానని, తాను మాంఛెస్టర్‌కు వచ్చిన విషయాన్ని తెలుసుకుని ధోనీ స్వయంగా టికెట్లను పంపించారని అన్నారు.

గుండెపోటుకు గురైనా.. మాత్రలు వెంట తీసుకుని!
ఇప్పటికే ఆయన మూడుసార్లు గుండెపోటుకు గురయ్యారు. అయినప్పటికీ.. ధోనీని ప్రత్యక్షంగా చూడటానికి ఎలాంటి రిస్కయినా తీసుకుంటానని అంటున్నారాయన. రోజూ మూడు పూటలా 12 రకాల మాత్రలను ఆయన వాడుతున్నారు. మాంఛెస్టర్‌లోని ఓ హోటల్‌లో భారతీయ సంతతికి చెందిన మరో సూపర్ ఫ్యాన్ సుధీర్‌తో కలిసి నివసిస్తున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే చికాగో ఫ్లయిట్ ఎక్కేస్తానని అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications