

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పదిహేడు వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు ధోని 33 పరుగుల దూరంలో ఉన్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం మూడో వన్డే జరగనుంది.
రాంచీ వేదికగా జరగనున్న ఈ వన్డేలో ధోని ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని ఇప్పటివరకు సాధించిన పరుగులు 16,967. ఇందులో ఆసియా ఎలెవన్ జట్టు తరుపున ఆడినవి కూడా ఉన్నాయి. దీంతో మొత్తం 528 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన ధోని 16 సెంచరీలు, 106 హాఫ్ సెంచరీలు చేశాడు.
ఇక, ధోని యావరేజి 45.00 గా ఉంది. భారత్ తరుపున 90 టెస్టు మ్యాచ్‌లాడిన ధోని 4,876 పరుగులు సాధించగా, 340 వన్డేల్లో 10,474 పరుగులు నమోదు చేశాడు. 98 టీ20ల్లో 1,617 పరుగుు చేశాడు. వన్డేల్లో 10 సెంచరీలు, 71 హాఫ్ సెంచరీలు ఉండగా, టెస్టుల్లో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని కంటే ఎక్కువ పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్(34,357), రాహుల్ ద్రవిడ్(24, 208), విరాట్ కోహ్లీ(19, 453), సౌరవ్ గంగూలీ(18,575), వీరేంద్ర సెహ్వాగ్(17, 253)లు మాత్రమే ఉన్నారు. తొలి రెండు వన్డేల్లో భారత్ విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరిస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.