
హైదరాబాద్: జూన్ నెలలో మొదలుపెట్టిన విదేశీ పర్యటనలో భాగంగా టీమిండియా బుధవారం సోమవారం శుభారంభాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేకత ఏంటంటే ఇది టీమిండియాకు వందో మ్యాచ్. ఇప్పటి వరకు భారత్ 100 అంతర్జాతీయ టీ20లు ఆడింది. భారత్ ఆడిన టీ20లు వంద అయితే అందులో అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ.
అంటే ధోనీ ఖాతాలో 90 మ్యాచ్‌లలో ఆడిన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్‌కి సాధ్యం కాని రీతిలో భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఇలా భారత్ ఇప్పటి వరకు 100 టీ20లు ఆడితే.. ధోనీ ఇందులో 90 ఆడాడు. 2006 నుంచి భారత్ టీ20లలో ఖాతా తెరిచింది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తన తొలి టీ20 ఆడింది.
అప్పటి ఆరంభ మ్యాచ్‌కు వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా వ్యవహరించి భారత్‌కు విజయం తెచ్చిపెట్టాడు. అయితే, భారత్ తొలి టీ20 ఆడిన జట్టులో ఉన్న ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఇప్పటికీ ఆ ఫార్మాట్‌లో కొనసాగుతున్నారు. వారెవరంటే ధోనీ, రైనా, దినేశ్ కార్తీక్. టీమిండియా ఆడిన వందో మ్యాచ్‌లో ధోనీ, రైనా ఆడగా దినేశ్ కార్తీక్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
ఇప్పటి వరకు 90 టీ20లు ఆడిన ధోనీ 79 ఇన్నింగ్స్‌ల ద్వారా 1,455 పరుగులు సాధించాడు. మరో రెండు మ్యాచ్‌లు ఆడటం ద్వారా ధోనీ మరో అరుదైన రికార్డును అందుకోబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి ధోనీ ఆడిన మ్యాచ్‌లు 498. మరో రెండు మ్యాచ్‌లు ఆడితే ధోనీ 500 మ్యాచ్‌లాడిన భారత్ ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. భారత్ తరఫున సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే 500లకు పైగా మ్యాచ్‌లు ఆడారు.