
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జమ్మూ కాశ్మీర్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ధోని జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ బరాముల్లా జిల్లాలోని కంజెర్ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించిన చినార్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు ధోని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారత ఆర్మీ నిర్వహించిన ఈ మ్యాచ్‌కి గౌరవ లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో ధోని అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వెళ్లిన ధోనిని అక్కడి యువత అవమానించేలా వ్యవహరించింది. ధోని ముందే బూమ్ బూమ్ అఫ్రిది అంటూ పాక్ మాజీ కెప్టెన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.
మరోవైపు ధోనిని ఫొటోలు తీసుకుంటూనే అతనికి వినపడేలా అఫ్రిదికి మద్దతుగా నినాదాలు చేస్తుండటంతో ఆర్మీ జవాన్లు వాళ్లను అడ్డుకున్నారు. అక్కడ నుంచి యువతను దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ సందర్భంగా భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలా? అన్న ప్రశ్నకు ధోని తనదైన శైలిలో స్పందించాడు. ఇది ప్రభుత్వ నిర్ణయానికి వదిలేయడమే మంచిదని చెప్పాడు. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. అది క్రీడ కన్నా ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంటుందని, దీనిని పెద్ద విషయంగా పరిగణిస్తారని అన్నారు.
భారత్-పాక్ మ్యాచ్ అంటే అది దౌత్యపరంగా, రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కాబట్టి ప్రభుత్వానికే ఈ విషయాన్ని వదిలేయాలని ధోని చెప్పుకొచ్చాడు.