IPL 2026: క్రికెట్ ప్రపంచంలో ఓ ప్లేయర్ ఫామ్‌లో ఉన్నప్పుడు పొగడ్తలు రావడం ఎంత సహజమో.. విఫలమైతే పాత విషయాలను గుర్తు చేస్తూ విమర్శలు రావడం కూడా అంతే సహజం. ప్రస్తుతం ఎస్ఆర్‌హెచ్(SRH) యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీపై నితీష్ ఘోరంగా విఫలం కావడంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ అతడిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.
6 బంతుల్లో ఒక్క పరుగు.. ఫ్యాన్స్ ఫైర్!
శనివారం ఆర్సీబీతో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి భారీ అంచనాల మధ్య క్రీజులోకి వచ్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడని భావించినప్పటికీ.. నితీష్ కేవలం 6 బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా ధోనీ ఫ్యాన్స్ నితీష్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. నితీష్ బ్యాటింగ్ టెక్నిక్‌ను ప్రశ్నిస్తూ.. నెట్టింట మీమ్స్, పోస్టులతో హోరెత్తిస్తున్నారు.

ఆ పాత ఇంటర్వ్యూ మళ్లీ తెరపైకి..
ఫ్యాన్స్ ఇంతగా ఫైర్ అవ్వడానికి కారణం నితీష్ గతంలో ధోనీపై చేసిన కామెంట్స్. 2024లో ఓ ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "ధోనీకి టాలెంట్ ఉంది కానీ టెక్నిక్ లేదు. విరాట్ కోహ్లీకి ఉన్నంత టెక్నిక్స్ ధోనీకి లేవు" అని కామెంట్ చేశాడు. ఆ సమయంలోనే ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి విఫలమవ్వడంతో ధోనీ ఫ్యాన్స్ ఆ పాత వీడియో క్లిప్‌లను, కామెంట్లను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
నీ టెక్నిక్ ఏమైంది నితీష్ అంటూ సెటైర్లు
ధోనీ లాంటి లెజండరీ ఆటగాడి టెక్నిక్‌పై కామెంట్ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని అభిమానులు ఇప్పుడు గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. "టెక్నిక్ లేని ధోనీ దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు, వేల పరుగులు చేశాడు.. మరి అపారమైన టెక్నిక్ ఉందని చెప్పుకునే నువ్వు నిన్న చేసిన ఆ ఒక్క రన్ ఏంటి?" అంటూ నిలదీస్తున్నారు. "నీ టాలెంట్‌తో నిన్న చాలా రన్స్ చేశావ్.. గుడ్!" అంటూ కొందరు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.
నెట్టింట వార్
నితీష్ కుమార్ రెడ్డి టాలెంటెడ్ ప్లేయర్ అని కొందరు మద్దతు ఇస్తున్నప్పటికీ.. ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. "టెక్నిక్ కంటే రిజల్ట్ ముఖ్యం అని ఇప్పటికైనా అర్థమైందా?" అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఓ యంగ్ ప్లేయర్ తనకంటే ఎంతో సీనియర్, దిగ్గజ ఆటగాడి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు పలుకుతున్నారు. ఏదేమైనా ఈ ఒక్క మ్యాచ్ వైఫల్యం నితీష్‌ను పాత వివాదంలోకి మళ్ళీ నెట్టేసింది.