
హైదరాబాద్: ధోని అంటే అభిమానులకు ఎంత ఇష్టమో నిరూపితమయ్యే సంఘటన మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో చోటు చేసుకుంది. ఓ యువకుడు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని మైదానంలోనికి దూసుకొచ్చాడు. నేరుగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వద్దకు పరుగులు తీశాడు.
ధోని కాళ్లకు నమస్కరించాడు. వెంటనే ధోని అతడిని లేపడంతో తన చేతిలో ఉన్న అట్ట ముక్క (సిక్సర్‌ను సూచించేది)పై ఆటోగ్రఫీ ఇవ్వాల్సిందిగా ధోనిని కోరాడు. అయితే ధోని అతడిని ఇది సరైన సమయం కాదని, మైదానం విడిచి వెళ్లాల్సిందిగా కోరాడు. ఆ తర్వాత అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అక్కడ నుంచి తీసుకెళ్లారు.
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్ధి శ్రీలంకకు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.


ఈ మ్యాచ్‌లో 151 బంతుల్లోనే 13 ఫోర్లు, 12 సిక్సర్లతో వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ చేశాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. గతంలో రోహిత్‌శర్మ ఆస్ట్రేలియా, శ్రీలంకపై డబుల్ సెంచరీలు చేశాడు. ఇదే శ్రీలంకపై కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు చేశాడు.
వన్డేల్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరుగా ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 50 ఓవర్ల పాటు క్రీజులో ఉండి 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సులతో 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.