మిర్పూర్: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మ్యాచ్ ఫీజులో భారీ కోత పడింది. మూడు వన్డేల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన తొలి వన్డే సందర్భంగా, బంగ్లాదేశ్ నిర్దేశించిన 308 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ చేస్తున్న ధోనీ.. బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఢీకొట్టాడు.
దీంతో ధోనీకి మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానాను విధిస్తూ మ్యాచ్ రిఫరీ ఆండీ పాయ్ క్రాఫ్ట్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ధోనీ సింగిల్ తీస్తూ క్రీజ్‌లోకి చేరే క్రమంలో వేగంగా దూసుకొచ్చి, తనకు అడ్డుగా ఉన్న ముస్తాఫిజుర్‌ను ఢీకొన్నాడు.
ఐసీసీ నిబంధనల ప్రకారం లెవెల్-2 ఛార్జ్ కింద ధోనీకి మ్యాచ్ ఫీజులో కోత విధించినట్లు మ్యాచ్ రిఫరీ తెలిపారు. దీనిపై శుక్రవారం ఉదయం టీమ్ హోటల్‌లో ఫీల్డ్ అంపైర్లు రాడ్ టక్కర్, ఎనాముల్ హేక్యూ మోనీలతో సమావేశమైన అనంతరం రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీనికి సంబంధించి ధోనీతో పాటు టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రికి కూడా సమన్లు జారీ చేశారు. ఢీకొట్టడంపై ధోనీ మాట్లాడుతూ... ఆ బౌలర్ (ముస్తాఫిజుర్) తాను మరోవైపు నుండి వెళ్తాననుకున్నాడని, అలాగే తాను అనుకున్నానని చెప్పాడు. అయితే, ఇద్దరిలో ఎవరం కూడా అలా చేయలేదని, దీంతో బలంగా ఢీకొట్టుకోవాల్సి వచ్చిందని చెప్పాడు.
పరుగులో భాగంగా అటు వైపు వెళ్లేందుకు తాను దగ్గరి దారి చూసుకుంటానని చెప్పాడు. సంఘటన తర్వాత తాను ముస్తాఫిజుర్‌తో మాట్లాడానని చెప్పాడు. ఇలాంటి సంఘటనలు మైదానంలో సాధారణమేనని, మ్యాచ్ అనంతరం తామిద్దరం చేతులు కలిపామని చెప్పాడు. కాగా, తన తప్పిందవల్లే ధోనీ ఢీకొట్టినట్లు ముస్తాఫిజుర్ తెలిపాడు.