టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కొనియాడాడు. కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కంటే రోహిత్‌యే గొప్ప అని పేర్కొన్నాడు. ఇటీవల ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. రోహిత్‌ను కాదని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు జట్టు పగ్గాలు అందించింది. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో ధోనీని మించిన నాయకుడు రోహిత్ అని పార్థివ్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఐపీఎల్‌లో ధోనీ, రోహిత్ తమ ఫ్రాంచైజీలకు అయిదు టైటిళ్లు అందించారు. అత్యుత్తమ సారథులుగా వారిద్దరు రికార్డులు నెలకొల్పారు. ''ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో రెండు ఐపీఎల్ టైటిళ్లు సాధించింది. రోహిత్ అత్యుత్తమ సారథి అని చెప్పడానికి ఇదో ఉదాహరణ. మైదానంలో నాయకుడు ప్రశాంతతతో ఉండకపోతే ఈ ఫలితం సాధ్యమయ్యేది కాదు. ఉత్కంఠగా సాగే మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు ఘోరమైన తప్పులు, పొరపాటు చేస్తుంటాం. కానీ రోహిత్ గత పదేళ్లలో అలాంటి పొరపాటు ఏమీ చేయలేదు''

''కొన్నిసార్లు ధోనీ కూడా తప్పులు చేశాడు. పవన్ నేగికి ఓవర్ అందించి పొరపాటు చేశాడు. కానీ రోహిత్‌ను చూడండి. అలాంటి తప్పు అతడు చేయలేదు. సింపుల్ ప్రాసెస్‌తో ఉండాలని ధోనీ సలహా ఇస్తుంటాడు. రోహిత్ దాన్ని చేసి చూపిస్తుంటాడు'' అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. పార్థివ్ వ్యాఖ్యలతో మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఏకీభవించాడు.
''ముందే ప్రణాళిక రచించినా మ్యాచ్ మధ్యలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. రోహిత్ పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటాడు. వాటిలో చాలా వరకు మ్యాచ్‌కు ముందు అనుకోనివే ఉంటాయి. ఐపీఎల్‌లో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే కెప్టెన్లకు అసలైన సవాలు అని, కానీ ఆ రోహిత్ విషయంలో విజయవంతమయ్యాడు. ముంబైని గెలిపించాడు'' అని జహీర్ ఖాన్ వెల్లడించాడు.
తమ ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం రోహిత్ విజయరహస్యమని పార్థివ్ పటేల్ చెప్పాడు. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్లకు రోహిత్ అండగా నిలిచాడని, అందుకే వాళ్లు ఇప్పుడు స్టార్ ప్లేయర్లు అయ్యారని తెలిపాడు. మార్చి 22న ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడనున్నాయి. కాగా, మార్చి 24న ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.