ఎంతో హుందాగా... పెవిలియన్‌ను ప్రారంభించడానికి ధోనీ నిరాకరణ!


హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నాడు. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‌సీఏ) స్టేడియంలో తన పేరు మీద ఏర్పాటు చేసిన ధోనీ పెవిలియన్‌ను ఆవిష్కరించేందుకు నిరాకరించాడు. ముంబైలోని వాంఖడే మైదానంలోని పెవిలియన్‌లకు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పేరు ఉండగా, ఢిల్లీలో ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో వీరేంద్ర సెహ్వాగ్ గేట్ ఉంది.

ఎంతో హుందాగా ధోని నిరాకరణ
అలాగే ఉప్పల్ స్టేడియంలోని పెవిలియన్‌లకు వీవీఎస్ లక్ష్మణ్, శివలాల్ యాదవ్ పేర్లు పెట్టడం జరిగింది. అలాగే జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో ఓ స్టాండ్‌కు ‘మహేంద్ర సింగ్ ధోనీ పెవిలియన్'గా నామకరణం చేశారు. దీనిని ఆవిష్కరించాల్సిందిగా ధోనిని కోరగా... ఎంతో హుందాగా అతడు ఇందుకు నిరాకరించాడు.
రాంచీలో మూడో వన్డే
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే రాంచీలోని జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇరు జట్లు బుధవారం అక్కడికి చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈ పెవిలియన్‌ను ప్రారంభించమని జేఎస్‌సీఏ స్టేడియం ఆధికారులు ధోనీని కోరగా వారి విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించాడు.

నార్త్‌స్టాండ్‌కు ధోనీ పేరు
"మీడియా, వీఐపీ బాక్స్‌లు ఉన్న నార్త్‌స్టాండ్‌కు ధోనీ పేరు పెట్టాలని గతేడాది సాధారణ వార్షిక సమావేశంలో నిర్ణయించాం. మహీని వచ్చి దానిని ప్రారంభించాలని కోరాం. అందుకతడు నా సొంత ఇంట్లో ఆవిష్కరించేందుకు ఏముంటుందని అంటూ సున్నితంగా తిరస్కరించాడు. అతనిప్పటికీ ఎంతో వినమ్రతతో వ్యవహరిస్తుంటాడు" అని జీఎస్‌సీఏ కార్యదర్శి దేవాశీశ్ చక్రవర్తి అన్నారు.

ధోనికి సొంత మైదానంలో ఇదే చివరి వన్డే
మరోవైపు ధోనికి సొంత మైదానంలో ఇదే చివరి వన్డే కావొచ్చని భావిస్తున్నా.. అయితే, ఇందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లేమీ చేయలేదని దేవాశీశ్ చక్రవర్తి చెప్పుకొచ్చారు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో టీమిండియా విజయం సాధించడంతో ప్రస్తుతం సిరిస్‌లో కోహ్లీసేన 2-0 ఆధిక్యంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications