నేను వైన్ లాంటి వాడిని: ఆ రెండు రికార్డులపై ధోని
హైదరాబాద్: తాను వైన్ లాంటి వాడినని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ధోని చాన్నాళ్ల తర్వాత ఈ వన్డేలో అంతర్జాతీయ స్థాయిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
79 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 78 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మూడో వన్డేలో అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కీపింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన ధోనిని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం వరించింది.
మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ తన వయసుతో పాటు ఆట కూడా మెరుగవుతుందని చెప్పాడు. అంతేకాదు తాను వైన్ లాంటి వాడినని చమత్కరించాడు. గత ఏడాదిన్నర నుంచి టీమిండియా టాపార్డర్ అద్వితీయంగా ఉందని ధోని కొనియాడాడు.
దీంతో మిడిల్ ఆర్డర్‌లో మంచి స్కోరు చేయడానికి అవకాశం దొరుకుతుందని ధోని అన్నాడు. ఇక మూడో వన్డేలో ప్రధానంగా టాపార్డర్ రాణించడంతోనే తాను సులువుగా పరుగులు సాధించడానికి ఆస్కారం ఏర్పడిందని ధోని పేర్కొన్నాడు.

కుల్దీప్, అశ్విన్‌లకు ధోని ప్రశంసలు
ఈ మ్యాచ్‌లో తమ అద్భుత బౌలింగ్‌లో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన స్పిన్నర్లు కుల్దీప్, అశ్విన్‌లను ధోని కొనియాడాడు. ముఖ్యంగా వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్‌ను అశ్విన్(3/28), కుల్‌దీప్ యాదవ్(3/41)లు క్రీజులో కుదురుకోనీయకుండా వెంట వెంటనే పెవిలియన్‌కు పంపిన తీరు అద్భుతమని అన్నాడు. కుల్దీప్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎన్నో గేమ్‌లు ఆడినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని అన్నాడు.

గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో అద్భుతం
ఇక్కడ ఎలా బౌలింగ్ చేస్తే వికెట్లు పడతాయో తెలిసి ఉండాలని ధోని అన్నాడు. 5-10 గేమ్‌లు ఆడితే ఆ విషయం అతడికే అర్ధం అవుతుందని ధోని అన్నాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని ధోని ప్రశంసలతో ముంచెత్తాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ధోని పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత్ బ్యాట్స్‌మన్‌గా, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా ధోని చరిత్ర సృష్టించాడు.

మహమ్మద్ అజారుద్దీన్ రికార్డును అధిగమించిన ధోని
శుక్రవారం విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 15వ పరుగు తీసిన ధోనీ టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో అజేయంగా 78 పరుగులు చేసి మొత్తం 9,442 పరుగులతో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన ధోని వన్డేల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా ధోని (వన్డే, టెస్టు, టీ20)లో 322 సిక్సర్లు బాదాడు.

వన్డేల్లో 200 సిక్సులు బాదిన తొలి భారత క్రికెటర్
ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది 476 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత క్రిస్‌గేల్ (434), బ్రెండన్ మెకల్లమ్ (398), సనత్ జయసూర్య (352) సిక్స్‌లతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధికంగా సెహ్వాగ్, టీ20ల్లో అత్యధికంగా యువరాజ్, వన్డేల్లో అత్యధికంగా ధోనీ సిక్స్‌లు బాదారు. ఇక వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన కీపర్ జాబితాలో ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications