టీమిండియా క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్, కూల్ కెప్టెన్‌గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ 2017లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇన్నాళ్లకు బయటపడింది. ఎంఎస్ ధోనీ స్వచ్ఛందంగా తప్పుకున్నారని అందరూ భావించినప్పటికీ.. దాని వెనుక బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒత్తిడి ఉందనే సంచలన విషయాలను మాజీ సెలెక్టర్ జతిన్ పరంజపే వెల్లడించారు.
మహీ.. ఇదే సరైన సమయం!
2017లో విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే ప్రక్రియ ఎలా జరిగిందో జతిన్ పరంజపే వివరించారు. అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో కలిసి తాను ధోనీని కలిసినట్లు ఆయన తెలిపారు. "ధోనీ అప్పుడు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతనికి ఎంత గౌరవపూర్వకంగా చెప్పాలి అనే దానిపై మేమిద్దరం ముందుగానే చర్చించుకున్నాం. ప్రాక్టీస్ పూర్తయ్యాక ధోనీ దగ్గరికి వెళ్లి.. 'మహీ, కెప్టెన్సీ నుంచి తప్పుకుని ముందుకు వెళ్లడానికి ఇదే సరైన సమయం అని మేము భావిస్తున్నాం అంటూ చెప్పాం" అని జతిన్ పరంజపే గుర్తుచేసుకున్నారు.

నిరసన తెలపని ధోనీ.. మెయిల్‌తో ముగింపు
సెలక్టర్ల మాటలకు ధోనీ ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకపోవడం విశేషం. దానికి బదులుగా, ఎమ్మెస్కే ప్రసాద్‌ను 'అన్నా' అని పిలుస్తూ.. "అన్నా, ఇది సరైన నిర్ణయం. నా నుంచి మీకేం కావాలో చెప్పండి" అని ధోనీ బదులిచ్చారు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు రాతపూర్వకంగా ఇవ్వాలని కోరగా.. ధోనీ అంగీకరించారు. ఆ రోజు అర్ధరాత్రి సెలక్షన్ కమిటీకి ధోనీ నుంచి 'నేను తప్పుకోవాలనుకుంటున్నాను' అని ఈమెయిల్ వచ్చినట్లు జతిన్ పరంజపే వెల్లడించారు.
విరాట్ కోహ్లీకి పూర్తి సపోర్ట్
కెప్టెన్సీ పోతున్నా ధోనీలో ఏమాత్రం అహంకారం కనిపించలేదని సెలెక్టర్లు కొనియాడారు. "విరాట్ నాకు సోదరుడి వంటివాడు. అతనితో కలిసి నేను పూర్తిస్థాయిలో పని చేస్తాను. నా అనుభవం అంతా అతనికి అందిస్తాను. మేమంతా కలిసి ఒక గొప్ప జట్టును నిర్మిస్తాం, మీరు ఆందోళన చెందకండి" అని ధోనీ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ధోనీ తన కెరీర్ చివరి వరకు విరాట్ కోహ్లీకి మార్గదర్శకుడిగా ఉంటూ మైదానంలో కీలక సూచనలు చేస్తూనే ఉన్నారు.
కఠిన నిర్ణయాల వెనుక విమర్శలు
ఈ నిర్ణయం తీసుకున్నందుకు అప్పట్లో సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వచ్చాయని.. కానీ జట్టు భవిష్యత్తు కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని జతిన్ పరంజపే చెప్పుకొచ్చారు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ధోనీ.. 35 ఏళ్ల వయసులో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని విరాట్ కోహ్లీ శకానికి నాంది పలికారు.