హైదరాబాద్: కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్‌లో 300వ వన్డే ఆడిన ధోని అత్యధికంగా 73 సార్లు క్రీజులో నాటౌట్‌గా నిలిచాడు.
శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో 42 బంతుల్లో ధోని 5 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 49 పరుగులు చేసి చివరి వరకూ నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇప్పటి వరకు షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా), చమిందా వాస్ పేరిట ఉన్న 72 సార్లు నాటౌట్ రికార్డును ధోని బద్దలు కొట్టాడు.
అంతేకాదు వన్డేల్లో అత్యధికంగా 73 సార్లు క్రీజులో నిలిచిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ని ఆరంభించిన ధోని మొదట్లో నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. ఆ తర్వాత మ్యాచ్ ఫినిషర్ లేని లోటు తీర్చేందుకు ఆరో స్థానానికి మారిపోయాడు.
ఈ క్రమంలోనే చివరి వరకూ క్రీజులో ఉంటూ టీమిండియాకు ఎన్నో మ్యాచ్‌ల్లో అద్భుతమైన విజయాలను అందించాడు. ఈ క్రమంలో ధోని ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందాడు. ఇదిలా ఉంటే నాలుగో వన్డేకి ముందు ధోనికి కోహ్లీసేన అరుదైన బహుమతి ఇచ్చింది.
భారత జట్టు తరుపున నాలుగో వన్డేకి ముందు ఈ బహుమతిని విరాట్ కోహ్లీ అందజేశాడు. ఇంతకీ అతడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? అది ఓ ప్లాటినమ్ బ్యాట్. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్‌కు ముందు ధోనికి ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
ఇదే మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకూర్‌కు కోచ్ రవిశాస్త్రి టీమ్ క్యాప్ అందించాడు. అనంతరం ధోనికి విరాట్ కోహ్లీ బహుమతి ఇచ్చాడు. ఈ సందర్భంగా వీడియోతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న మాటలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 'ధోనీ.. నువ్వు ఎప్పటికీ మాకు కెప్టెన్‌వే' అని కోహ్లీ ప్రశంసించాడు.