టీమిండియా లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మైదానంలో ఎప్పుడూ కూల్‌గా కనిపిస్తుంటాడు. అదే ఏదైనా వేదికపై ఎక్కితో సైలెంట్‌గానే జోకులతో చంపేస్తుంటాడు. అతను ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయం స్పష్టమైంది. ఇప్పుడు తాజాగా మరోసారి తన చమక్కులతో ధోనీ అందర్నీ నవ్వించాడు. తన బ్యానర్‌లో తెరకెక్కిన ఎల్‌జీఎం సినిమా ట్రైలర్ లాంచ్‌తో ఈ సరదా ఘటన జరిగింది.
ఈ చిత్రంలో తమిళ కమెడియన్ యోగి బాబు కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అందుకే ట్రైలర్ లాంచ్‌లో కూడా అతను పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనకు ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున క్రికెట్ ఆడాలని ఉందని యోగి బాబు చెప్పాడు. దీనికి ధోనీ చాలా ఫన్నీ సమాధానం ఇచ్చాడు. చెన్నై మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు రిటైర్ అయిన విషయాన్ని గుర్తు చేసిన అతను.. రాయుడు స్థానంలో యోగి బాబు ఆడొచ్చన్నాడు.

'రాయుడు రిటైర్ అయ్యాడు కదా. కాబట్టి సీఎస్‌కేలో ఒక ప్లేస్ ఖాళీగా ఉంది. నేను టీం మేనేజ్‌మెంట్‌తో మాట్లాడతా. కానీ నువ్వు సినిమాల్లో మరీ బిజీగా ఉన్నావు కదా. కాబట్టి ముందే చెప్తున్నా.. నా టీంలో చాలా నిలకడగా ఆడాల్సి ఉంటుంది. బౌలర్లు చాలా ఫాస్ట్ బౌలింగ్ చేస్తారు. నిన్ను ఎలాగైనా మంచాన పడేయాలని చూస్తారు. మరి నీ ఇష్టం' అని యోగిబాబుకు వార్నింగ్ ఇచ్చాడు ధోనీ.
ఈ సమాధానం విన్న ప్రేక్షకులంతా నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ కూడా ధోనీ కామిక్ సెన్స్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. అలాగే భార్యల గురించి మాట్లాడిన ధోనీ.. 'మీలో ఎంత మందికి పెళ్లిళ్లు అయిపోయాయి? అయితే ఇంట్లో బాస్ ఎవరో అందరికీ తెలిసే ఉండాలి కదా' అంటూ మరో జోక్ పేల్చాడు. ఈ మాటలు విన్న ధోనీ భార్య సాక్షి కూడా గల గలా నవ్వేసింది.