ముంబై: భారత క్రికెట్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ ఎంతో సేవ చేశాడు. అతని సేవలు మరువలేనివి. సీనియర్లు దూరమైన కీలకమైన సమయంలో అతను కెప్టెన్సీని చేపట్టాడు. టీమిండియాను ముందుకు నడిపించాడు. కెప్టెన్‌గా ఎన్నో రికార్డులు సాధించాడు. ధోనీ కూల్ కెప్టెన్‌గా పేరుగాంచాడు.
కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా ధోనీ ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు. బెస్ట్ ఫినిషర్‌గా నిలిచాడు. హెలికాప్టర్ షాట్ అంటే ధోనీయే. ఈ రోజు (గురువారం) ధోనీ పుట్టిన రోజు. కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా ధోనీ సాధించినవి మరిచిపోలేనివి ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని ఇక్కడ..
శ్రీలంకతో 2011లో వాంఖేడే స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ధోనీ 91 నాటౌట్‌గా నిలిచాడు. ఇది ఎవరూ మరిచిపోలేని ఇన్నింగ్స్. భారత్ 114 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. మిడిల్‌లో వచ్చిన ధోనీ అద్భుతంగా ఆడాడు. తద్వారా ప్రపంచ కప్‌ను రెండోసారి గెలిచిన టీంగా భారత్ నిలిచింది.

శ్రీలంక పైన 183 నాటౌట్. 2005లో మూడో వన్డేలో స్రీలంక పైన జరిగిన మ్యాచ్‌లో ధోనీ 183 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. అప్పుడే ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్లో చాలాకాలం మనగలుగుతాడని అందరూ భావించారు.
ఆస్ట్రేలియా పైన 124 పరుగులు. 2009లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో భారత్ 97 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో వచ్చిన ధోనీ 124 పరుగులు చేసి భారత్‌ను గట్టెక్కించాడు. 15 ఓవర్లకు 97 పరుగులు ఉన్న టీమిండియా.. ధోనీ ధాటికి 50 ఓవర్లలో ఏడు వికెట్లు 354 పరుగులు చేసింది. తద్వారా భారత్ గెలిచింది.
ఆస్ట్రేలియా పైన 224 పరుగులు. 2013లో ఫిబ్రవరి 24న చెపాక్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచులో ధోనీ తన తొలి, ఒకే ఒక డబుల్ సెంచరీ చేశాడు. ఓ కెప్టెన్‌కు ఇది అత్యధిక స్కోర్. గతంలో సచిన్ టెండుల్కర్ కెప్టెన్‌గా 217 పరుగులు చేశాడు. దానిని ధోనీ బీట్ చేశాడు.