దుబాయ్: భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ మరో రికార్డ్ సృష్టించాడు! ఇప్పటి వరకు దేశీయ కంపెనీలతో, మన దేశంలో ఉత్పత్తులు కలిగిన అంతర్జాతీయ మార్కెట్ సంస్థలతో ఎండార్స్‌మెంట్స్ ఉండేవి. ఇప్పుడు తొలిసారి భారత్ బయటి కంపెనీతో భారీ ఎండార్స్‌మెంట్ కుదుర్చుకున్నాడు.
ధోనీతో దుబాయ్‌కి చెందిన గ్రాండ్ మిడ్ వెస్ట్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. మూడు సంవత్సరాల పాటు తమ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడని ఆ కంపెనీ శుక్రవారం నాడు ప్రకటించింది. ఈ కంపెనీకి దుబాయ్, ఐర్లాండ్, యూకే దేశాల్లో పలు రకాల హోటల్ వ్యాపారాలు ఉన్నాయి.

యూఏఈలో స్థానిక క్రికెట్ జట్టును సైతం కొనుగోలు చేసింది. తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించేందుకు సన్నాహకాలు చేసుకుంటుంది. మరోవైపు, ఓ ప్రముఖ విదేశీ కంపెనీతో కలసి పని చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ధోనీ తెలిపాడు.
గ్రాండ్ మిడ్ వెస్ట్ గ్రూప్ యూఏఈకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జఫర్ షా ఖాన్‌కు చెందింది. అతనికి దుబాయ్, యూకే, ఐర్లాండులలో హోటల్ బిజినెస్‌లు ఉన్నాయి. అయితే, ఎండార్స్‌మెంట్ విలువ తెలియాల్సి ఉంది.