
హైదరాబాద్: రికార్డుల రారాజు టీమిండియా వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ టీ20 ఫార్మాట్‌లో మరో రికార్డును కొల్లగొట్టాడు. టీ 20 సిరీస్‌లో ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా ఈ ఘనతను సాధించాడు. సిరీస్ నిర్ణయాత్మక టీ20 మ్యాచ్‌లో వికెట్ల వెనుక ఐదు క్యాచ్‌లు అందుకున్న ధోనీ.. టీ20ల్లో 50 క్యాచ్‌లు అందుకున్న ఏకైక వికెట్ కీపర్‌గా నిలిచాడు.
అతని తర్వాత స్థానంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ దినేశ్ రామ్‌దిన్ 34 క్యాచ్‌లతో ఉండగా.. దక్షిణాఫ్రికా కీపర్ డికాక్ 30 క్యాచ్‌లతో ఉన్నాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో అత్యధిక స్టంపౌట్స్ చేసిన వికెట్ కీపర్‌గా ధోనీ అగ్రస్థానంలో కొనసాగుతుండటంతో ఇది మరో రికార్డు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. ఓపెనర్ జేసన్ రాయ్ (67) 31 బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సులు మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం భారీ టార్గెట్ ఛేదించే ఉద్దేశ్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన.. రోహిత్ శర్మ (100) 56 బంతుల్లో 11ఫోర్లు, 5సిక్సులు అజేయ సెంచరీ బాదడంతో భారత్ 18.4 ఓవర్లలోనే 201/3తో అలవోక విజయాన్ని అందుకుంది.
దీంతో.. మూడు టీ20ల సిరీస్‌ని భారత్ 2-1తో చేజిక్కించుకుంది. భారత్‌కి ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్ విజయం. టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ను గురువారం ఆడనుంది.