2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచి మరోసారి విశ్వవిజేతగా నిలిచింది టీమిండియా. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు భారత జట్టుపై ప్రశంసలు కురిపిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మను తెగ పొగిడేస్తున్నారు. కానీ మాజీ కెప్టెన్ ధోనీ మాత్రం.. భారత్ విజయంపై మాట్లాడటానికి సుముఖత చూపలేదు! ఓ రిపోర్టర్ మాట్లాడాలని ప్రశ్నించగా.. సైలెంట్ గా అక్కడి నుంచి ప్రశ్నను దాటవేస్తూ వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొదటగా గుర్తొచ్చేది అదే..
ధోనీ.. ఈ పేరు వినగానే మొదటగా ప్రతీ క్రికెట్ అభిమానికి గుర్తొచ్చేది ఐసీసీ ట్రోఫీలు. భారత్ తరఫున ఒకటి కన్నా ఎక్కువ ఐసీసీ టైటిల్స్ సాధించిన భారత సారథిగా నిలిచాడు. మహీ సారథ్యంలో భారత జట్టు.. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది. అలాంటి మహీ.. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు కూడా ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు ఓ యాడ్ కూడా చేశాడు.
ఇప్పుడు కాదు.. తర్వాత...
అయితే తాజాగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత దాదాపుగా ప్రతీ క్రికెట్ అభిమాని, మాజీ క్రికెటర్లు సంబరాలు చేసుకున్నారు. భారత జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ క్రమంలోనే భారత్ విజయం తన అభిప్రాయాన్ని మాట్లాడాలని ధోనీని ఓ రిపోర్టర్ అడిగారు. ఎయిర్ పోర్టు నుంచి ధోనీ బయటకు వెళ్తోన్న క్రమంలో కెమెరాలన్నీ చుట్టుముట్టగ.. ఓ మీడియా ప్రతినిథి ప్రశ్నించారు. అప్పుడు మహీ హడావుడిగా కెమెరాలన్నింటి నుంచి తప్పించుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుదాం అన్నట్టుగా సైగ చేసుకుటూ వెళ్లిపోయాడు. ఇది కాస్త కాంట్రవర్సీకి దారీ తీసింది. ఈ వీడియోనే ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
మహీ అలాంటోడు...
ఇదే అదునుగా చేసుకుని కొంతమంది ధోనీ హేటర్స్.. మహీ ఇన్ సెక్యూరిటీ మ్యాన్, కనీసం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీపై కూడా మాట్లాడలేడా, ధోనీ అసూయ ఉన్న వ్యక్తి, తాను తప్ప ఇతర ఏ క్రికెటర్ అయినా ఐసీసీ ట్రోఫీ గెలిస్తే అస్సలు జీర్ణించుకోలేడు, యువరాజ్ సింగ్ తండ్రి ధోనీ గురించి చెప్పేది నిజమే.. అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ధోనీకి మద్దతుగా నిలుస్తున్నారు.
