ముంబై: తన రిటైర్మెంట్‌పై ఓ ఆస్ట్రేలియా విలేకరి అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చాడు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ముంబైలోని వాంఖడె మైదానంలో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో ధోనికి మరోసారి ఈ ప్రశ్న ఎదురైంది.
ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విలేకరి ఈ ప్రశ్న అడిగాడు. దీనికి ధోని తనదైన శైలిలో సరదాగా స్పందించి అందిరనీ నవ్వుల్లో ముంచెత్తాడు. ఆస్ట్రేలియా విలేకరి ఎప్పుడు రిటైరవుతున్నావంటూ మీడియా సమావేశంలో ప్రశ్న అడిగిన వెంటనే అతడిని వేదిక మీదకి పిలిపించాడు ధోని.
ఆ తర్వాత అతడిని తన పక్కనే కూర్చోబెట్టుకుని, భుజంపై చెయ్యివేసి.. 'నేను ఫిట్‌గా లేనా?'.. 'సరిగా పరుగెత్తలేకపోతున్నానా'.. '2019 వరల్డ్ కప్ ఆడలేనని భావిస్తున్నారా' అంటూ ప్రశ్నలు సంధించాడు ధోని. దీంతో ఈ ప్రశ్నలకు ఆ విలేకరి అదేమి లేదన్నట్లుగా బదులిచ్చాడు.

'మీ ప్రశ్నకు మీరే బదులిచ్చేశారు'.. అంటూ అక్కడున్న వారందరినీ ధోని నవ్వించేశాడు. టాస్ కోల్పోవడమే దెబ్బతీసిందని ధోని అన్నాడు. సాధారణంగా ఇలాంటి పిచ్‌లపై టాస్ ఎంతో కీలకమని అన్నాడు. 'అయినా మరో 30 పరుగులు చేసివుండాల్సింది. గాలిలో తేమ ఉండడం వల్ల బంతిపై తడిచేరి మా బౌలర్లు సరిగా గ్రిప్ చేయలేకపోయారు.' అని ధోని చెప్పాడు.
'మామూలుగానైతే 190కి పైగా లక్ష్యం ఛేదించడం కష్టమైన విషయం. కానీ తొలి ఇన్నింగ్స్ కంటే రెండోసారి బ్యాటింగ్ ఈజీ అయిపోయింది. సిమ్మన్స్ రెండుసార్లు అవుట్ కాకుండా తప్పించుకున్న నోబాల్స్ విసిరిన బౌలర్లు నన్ను తీవ్రంగా నిరాశపరిచారు. ఫాస్ట్ బౌలర్లు కూడా పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి'' అని కెప్టెన్ ధోనీ అన్నారు.