
హైదరాబాద్: వార్త పత్రికలు చదవొద్దని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తనకు ధోని సలహా ఇచ్చాడని చెప్పాడని భారత యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. ఇటీవల ఓ టీవీ షో ఫైనల్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ "భారత జట్టులో చేరిన తర్వాత వార్తా పత్రికలు చదవడం మానెయ్యాలని, సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ధోని చెప్పాడు" అని అన్నాడు.
"ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ భాగమైన సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కష్టమే. కానీ వాటి విషయంలో చాలా జాగ్రత్తపడుతున్నా" అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. తనకు ముందు నుంచి తెలిసిన ఓ అమ్మాయి ఐపీఎల్ వేలంలో తర్వాత తనకు దగ్గరవ్వాలని ప్రయత్నించిందని అయ్యర్ తెలిపాడు.
"ముందెప్పుడూ తన గురించి పట్టించుకోలేదని. వేలం జరిగిన వెంటనే మెసేజ్ చేసింది. తొలుత తన ఎంపిక పట్ల సంతోషంగా ఉందని భావించానని కానీ తర్వాత ఆమె మాట్లాడడానికి బాగా ప్రయత్నించింది. ఆమె డబ్బు చూసి వచ్చిందని నాకు అర్థమైంది" అని అయ్యర్ పేర్కొన్నాడు.
ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన శ్రేయాస్ అయ్యర్... వరుస ఓటములతో అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి గంభీర్ తప్పుకుంటే.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి జట్టుని సమర్ధవంతంగా ముందుకు నడిపించిన సంగతి తెలిసిందే. 11వ సీజన్‌లో మొత్తం 14 ఇన్నింగ్స్‌లో 411 పరుగులు చేశాడు.