
వందేమాతరం నినాదంతో దద్దరిల్లిన స్టేడియం
అది 2011ప్రపంచకప్ ఫైనల్. టీమిండియా గెలవాలంటే మరో 27పరుగులు చేయాలి. క్రీజులో యువరాజ్ సింగ్, ధోనీ ఉన్నారు. ఆ టైంలో వాంఖడే స్టేడియంలో అభిమానులు అందరూ ఒక్కసారిగా వందేమాతరం.. వందేమాతరం.. అంటూ రెహ్మాన్ అందించిన సంగీతానికి లయకట్టి స్టేడియాన్ని హోరెత్తించారు. ఆ వందేమాతరం ఆలాపన ధోనీ గుండెను తాకింది.
క్రీజులో ఉన్న ధోనీకి గూస్ బంప్స్ వచ్చాయి. 28ఏళ్ల కల, సచిన్ జీవిత కాల కల, కెప్టెన్‌గా ఈ జన్మలో సాధించబోయే అపురూప విజయం, 120కోట్ల భారతీయుల స్వప్నం ధోనీ కళ్లముందు మెదిలాయి. అంతే ఎక్కడ లేని ప్రకంపనలు ధోనీ శరీరంలో ప్రసరించాయి. ఆ ఉత్తేజంతో క్రీజులో కడవరకు ఉన్న ధోనీ.. తనదైన స్టైల్లో సిక్సర్ కొట్టి టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.
లైఫ్‌లో మర్చిపోలేని క్షణాలవి
ఇక ధోనీకి గూస్ బంప్స్ వచ్చిన విషయాన్ని స్వయంగా ధోనీనే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ధోనీ మాట్లాడుతూ.. 'అది 2011 ప్రపంచకప్. విజయానికి ఇంకో 20, 25పరుగులు చేయాల్సి ఉంది. అప్పుడు స్టేడియంలో క్రౌడ్ వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. నాకు ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చేశాయి. అసలు నాకు గూస్ బంప్స్ ఎప్పుడూ రాలేదు.
కానీ ఆ టైంలో మాత్రం నా ఒళ్లంతా గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా నా లైఫ్‌లో ఎప్పటికీ నిలిచిపోయే క్షణాలవి. అలాంటి ఓ అవకాశం మళ్లీ రావాలని ఎదురుచూస్తున్నా. అది నా చేతుల్లో లేదు. కానీ నిజంగా ప్రపంచకప్ ఒడిసిపట్టడం అనిర్వచనీయమైన అనుభూతి' అని ధోనీ పేర్కొన్నాడు. ధోనీ మాట్లాడిన ఆ ఇంటర్వ్యూ రీల్ కాస్త వైరలైంది.

వాంఖడేలో ఫైనల్ మ్యాచ్.. బ్యాటింగ్లో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ
1983తర్వాత భారత క్రికెట్ జట్టు 2011 ఏప్రిల్ 2న వాంఖడేలో విశ్వవిజేతగా ఆవిర్భవించింది. సెమీస్‌లో పాకిస్థాన్‌ను మట్టి కరిపించి టీమిండియా ఫైనల్ చేరింది. న్యూజిలాండ్‌ను ఓడించి శ్రీలంక ఫైనల్‌కు చేరింది. ఏప్రిల్ 2న వాంఖడేలో ఫైనల్ మ్యాచ్ కోసం స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. టాస్ నెగ్గిన శ్రీలంక 6వికెట్ల నష్టానికి 274పరుగులు చేసింది.
మహేలా జయవర్ధనే 103పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 275పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మలింగ బౌలింగ్లో వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ అయ్యాడు. తర్వాత కొద్ది సేపటికే సచిన్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. అభిమానుల కళ్లల్లో సన్నగిల్లిన ఆశలు.

గౌతం గంభీర్ పోరాటం, ధోనీ ఫినిషింగ్
కానీ ఆ పరిస్థితుల్లో మరో ఓపెనర్ గౌతమ్ గంభీర్ గొప్పగా ఆడాడు. కోహ్లి 35పరుగుల వద్ద పెవిలియన్ చేరినా, మరో ఎండ్‌లో గంభీర్ పట్టువదలకుండా పోరాడాడు. ఇక ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చాడు. మహీ, గౌతీ కలిసి లంక బౌలర్లను సమర్థంగా మరో 52పరుగులు చేస్తే మనదే విజయనే స్థితిలో 91రన్స్ చేసిన గంభీర్ ఔటయ్యాడు.
ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యువీ (21 నాటౌట్)తో కలిసి ధోనీ (79 బంతుల్లో 91 నాటౌట్)తో లాంఛనాన్ని ముగించాడు. తనదైన స్టైల్లో సిక్సర్ తో ముగించాడు. చివరి బంతికి ఆ సిక్సర్, రవిశాస్త్రి కామెంట్రీ ఇప్పటికే చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. యువరాజ్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా, ధోనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.


Click it and Unblock the Notifications












