న్యూఢిల్లీ: పరిహారం కోరుతూ నోటీసులు పంపిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు బీసీసీఐ గట్టి షాకిచ్చింది. రెండు బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందానికి కచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది.
పాకిస్తాన్‌తో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనందుకు సంభవించిన నష్టాన్ని పూడ్చుకొనేందుకు పీసీబీ పరిహారం కోరుతూ బీసీసీఐకి గతవారం నోటీసులు పంపించింది.

ఈ మేరకు బీసీసీఐ నుంచి తమకు సమాధానం వచ్చిందని పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. బీసీసీఐ నుంచి తమకు ప్రతిస్పందన వచ్చిందని, వారు కొన్ని అంశాలు లేవనెత్తారని, అంగీకార ఒప్పందం చట్టబద్ధం కాదన్నారని ఆయన తెలిపాడు.
ఇండో-పాక్ సిరీస్‌లకు తమ ప్రభుత్వం నుంచి అనుమతి లేదని ఇక మాతో ఆడలేమని చెప్పిందని షహర్యార్ అన్నాడు. కాగా ఒప్పందాన్ని ఐసీసీ సమక్షంలో చేసుకున్నందున పరిహారం కోరుతూ ఐసీసీ వివాద పరిష్కార వేదికను తాము సంప్రదిస్తామన్నాడు.