
ఐపీఎల్ 2022లో పేలవమైన ప్రారంభం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ భీకరంగా పుంజుకుంది. ఈ సీజన్లో మొదటి రెండు మ్యాచ్‌లు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత.. సన్‌రైజర్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో చివరి ఓవర్లో మెయిడిన్ వేయడంతో పాటు ఒక రనౌట్ సహా నాలుగు వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్ వార్తల్లో హాట్ టాపిక్ అయ్యాడు. తన అద్భుతమైన పేస్‌తో ప్రముఖుల ప్రశంసలు పొందాడు. ఇక సన్‌రైజర్స్ మిగతా బౌలర్లు కూడా మంచి ప్రదర్శనలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
సన్‌రైజర్స్ ఫ్రాంచైజీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్నాడు. భువీ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో 8వికెట్లు తీశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో భువీ 3/22ప్రదర్శనతో నిప్పులు చెరిగాడు. అయితే భువీ పేస్ కొంచెం నెమ్మదించిందని సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ అన్నాడు.
జట్టు బౌలింగ్ విషయాలపై స్టెయిన్ మాట్లాడుతూ..'జట్టులో బౌలర్లందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. భువీ సీనియర్ ప్లేయర్ అయినప్పటికీ.. తన బౌలింగ్ విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిర్మోహమాటంగా (సపోజ్ నటరాజన్‌లా) తెలుపుకునేంత స్వేచ్ఛ వాతావరణం జట్టులో ఉంది. బౌలర్లకు తమకు ఎలాంటి శిక్షణ కావాలనుకుంటున్నారో.. అలాంటి తర్ఫీదు ఇస్తున్నాం. గేమ్‌లో వారు రాణించాలంటే ఏం చేయాలో వారికే ఎక్కువగా తెలిసి ఉంటుంది.'అన్నాడు.
ఎస్ఆర్‌హెచ్ బౌలర్లను మోటివేట్ చేసేందుకు, వారిపై ఒత్తిడి తగ్గించేందుకు స్టెయిన్ సలహాలు ఇస్తూ.. మీరు ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ల కంటే.. ఐపీఎల్లో అత్యుత్తమ భారతీయ ఆటగాళ్లతో పోటీపడుతున్నారంటూ తెలిపాడు. అలాగే తన సొంత ఉదాహరణ ద్వారా.. 'మీ దేశ స్టార్ ప్లేయర్లను మీ బౌలింగ్‌లో ఔట్ చేయడం మంచి అనుభూతి.
నా విషయంలో నాకు ఆండ్రీ రస్సెల్‌ను ఔట్ చేయడం హ్యాపీ. కానీ ఏబీ డివియలర్స్‌ను ఔట్ చేయాలనేది నా గోల్. ఎందుకంటే.. మేమిద్దరం దక్షిణాఫ్రికా జట్టులో ఆడతాం. నేను ఐపీఎల్లో డివిలియర్స్‌ను ఔట్ చేస్తే.. తిరిగి జాతీయ జట్టుకు వెళ్లినప్పుడు ఏబీడీ నుంచి నాకు లభించే గౌరవం భలే కిక్కిస్తుంది. ఈ ఐపీఎల్లో ఉన్న మజానే అది. మీ దేశ అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీపడటానికి ఇక్కడ మీకు ఓ మంచి అవకాశం దొరికింది.'అంటూ బౌలర్లను స్టెయిన్ ఎంకరేజ్ చేశాడు.