
హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ ఆప్ఘనిస్థాన్ బౌలర్లకు చుక్కులు చూపిస్తున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
జానీ బెయిర్ స్టో(90) ఔటైన క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో మోర్గాన్ 71 బంతుల్లో 4 ఫోర్లు, 17 సిక్సులు 148 పరుగులు చేసి గుల్బదిన్ నైబ్ బౌలింగ్‌లో రెహ్మాత్ షాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఈ క్రమంలో ఇయాన్ మోర్గాన్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సిక్సులు(17 సిక్సులు) బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అంతకుముందు రోహిత్ శర్మ(16), వాట్సన్(16), క్రిస్ గేల్(16), ఏబీ డివిలియర్స్(16) సిక్సుల రికార్డు బద్దలైంది.
ఈ మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా ఆప్ఘన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్‌కు చుక్కలు చూపించాడు. రషీద్ ఖాన్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాది కేవలం 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో మోర్గాన్‌కి ఇది 13వ సెంచరీ.
ఆ తర్వాత రషీద్ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్‌లో కూడా మూడు సిక్సులు బాదారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ వికెట్ తీయకుండా 110 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో చేరిపోయాడు.
దీంతో పాటు ఈ మ్యాచ్‌లో మోర్గాన్ సెంచరీ సాధించడంతో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
దీంతో పాటు ఈ మ్యాచ్‌లో మోర్గాన్ వన్డేల్లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాట్స్‌మన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఫోర్లు, సిక్సులు బాదుతూ ఆప్ఘన్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మోర్గాన్ సిక్సుల వర్షానికి ఆప్ఘన్ బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు.
ఈ మ్యాచ్‌లో సెంచరీతో వన్డేల్లో ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఒక ఎండ్‌లో మోర్గాన్ సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే... మరో ఎండ్‌లో జో రూట్ నెమ్మదిగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరి జోడీ మూడో వికెట్‌కు 100కు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.