
హైదరాబాద్: శ్రీలంక వేదికగా జరిగిన నిదహాస్ ట్రోఫీలో భారత జట్టు విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో పాటు భారత్ మరో రికార్డును నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు టీ 20 మ్యాచ్‌లలో ఒకే జట్టుపై అత్యధిక విజయాలను నమోదు చేసుకున్న జట్లలో భారత్ రెండో స్థానంలో ఉంది.
కాగా, ఇది బంగ్లాదేశ్‌పై భారత్‌కు వరుసగా ఎనిమిదో విజయం. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ ఆఖరి బంతిని సిక్స్‌గా మలచి భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ 20 ల్లో ఒక ప్రత్యర్థిపై అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రెండో జట్టుగా టీమిండియా స్థానం సంపాదించింది.
2009-18 మధ్యకాలంలో బంగ్లాదేశ్‌పై వరుస టీ 20 విజయాల్ని భారత్ సాధించింది. దాంతో బంగ్లాదేశ్‌పై వరుసగా ఏడు విజయాలు సాధించిన పాకిస్తాన్ రికార్డును భారత్ సవరించింది. అదే సమయంలో పొట్టి ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌పై ఇప్పటివరకూ భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా పరాజయం చెందకపోవడం మరో విశేషం.
అయితే టీ 20ల్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన రికార్డు పాకిస్తాన్ పేరిట ఉంది. 2008-15 మధ్యకాలంలో జింబాబ్వేపై పాకిస్తాన్ వరుసగా 9 టీ 20 విజయాల్ని నమోదు చేసింది. ఆ తర్వాత రెండో జట్టుగా టీమిండియా నిలిచింది.