
హైదరాబాద్: మూడో టీ20లో మరో 20 నుంచి 30 పరుగులు చేస్తే ఫలితం మరోలా ఉండేదని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. స్వదేశంలో టీమిండియాతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను 2-1తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
దీంతో ఇయాన్ మోర్గాన్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఆఖరి మ్యాచ్‌లో తమ జట్టు మరిన్ని పరుగులు చేసే అవకాశాన్ని కోల్పోవడంతో సిరీస్ ఓటమికి కారణమని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో తమ బ్యాటింగ్ ఆశాజనకంగా సాగలేదని, వరుసగా వికెట్లు చేజార్చుకున్నామని తెలిపాడు.
మరో 20 నుంచి 30 పరుగులు చేస్తే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని మోర్గాన్ తెలిపాడు. "మరో 20-30 పరుగులు తక్కువయ్యాయి. ఈ మైదానంలో 225 లేదా 235 లక్ష్యం అయితే ఛేజ్ చేసేందుకు టీమిండియా ఇబ్బంది పడేది. వికెట్లు తీసేందుకు ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది" అని మోర్గాన్ పేర్కొన్నాడు.
అదే సమయంలో లక్ష్య ఛేదనలో టీమిండియా ఆడిన తీరును మోర్గాన్ ప్రశంసించాడు. టీమిండియా వికెట్లను సాధించడంలో తాము వైఫల్యం చెందడం కూడా మ్యాచ్ చేజారడానికి కారణమని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మిడిల్ ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేయగా, డెత్ ఓవర్లలో మాత్రం 14 బంతుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆటతీరును మోర్గాన్ కొనియాడాడు. సరైన సమయంలో హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడటం కూడా తమ విజయాకాశాలన్ని దెబ్బ తీసిందని మోర్గాన్ వెల్లడించాడు. కాగా, బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన కోహ్లీసేన సిరిస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
ఓపెనర్ రోహిత్ శర్మ (56 బంతుల్లో 100 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో 199 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే టీమిండియా ఛేదించింది. ధావన్ (5) నిరాశపరిచినా కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 33) చెలరేగి ఆడటంతో టీమిండియా అలవోక విజయం సాధించింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే, మూడు టీ20ల సిరిస్ ముగియడంతో ఇరు జట్ల మధ్య జులై 12 నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే నాటింగ్‌హామ్ వేదికగా జరగనుంది.