టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చుట్టూ ఇప్పుడు వివాదాలు చుట్టుముట్టాయి. ఏడాది కాలంలోనే స్వదేశంలో రెండుసార్లు టెస్ట్ సిరీస్ వైట్‌వాష్‌కు గురికావడంతో గంభీర్ వ్యూహాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యాయి. గంభీర్ టెస్ట్ క్రికెట్ కోచింగ్ అర్హతలను ప్రశ్నిస్తూ పనేసర్ సంచలన సూచనలు చేశారు.
రంజీ ట్రోఫీలో పాఠాలు నేర్చుకో!
ANI వార్తా సంస్థతో మాట్లాడిన పనేసర్, గంభీర్ వైట్ బాల్ క్రికెట్‌లో (T20, వన్డే) అద్భుతమైన కోచ్ అని ఒప్పుకుంటూనే.. రెడ్ బాల్ (టెస్ట్) క్రికెట్‌లో ఆయనకు పట్టు లేదని విమర్శించారు.

"గౌతమ్ గంభీర్ వైట్ బాల్ క్రికెట్‌లో సక్సెస్ అయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ టెస్ట్ క్రికెట్ విషయానికొస్తే.. ఆయన ముందుగా రంజీ ట్రోఫీ టీమ్‌లకు కోచింగ్ ఇవ్వాలి. అక్కడి దేశీ కోచ్‌లతో మాట్లాడి రెడ్ బాల్ క్రికెట్‌లో జట్టును ఎలా నిర్మించాలో తెలుసుకోవాలి. ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో బలహీనంగా ఉందన్నది కాదనలేని వాస్తవం," అని పనేసర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
లక్ష్మణ్ వైపే బీసీసీఐ చూపు?
గత వారం దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత్ 0-2తో ఓడిపోయిన తర్వాత, టెస్ట్ జట్టు బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆయనను రెండుసార్లు సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏ (NCA) హెడ్‌గా తాను సంతోషంగా ఉన్నానని లక్ష్మణ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ స్పందన: "అవన్నీ కట్టుకథలే"
కోచ్ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా కొట్టిపారేశారు. "కోచ్ మార్పుపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. లీడర్‌షిప్ మార్పు గురించి బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గౌతమ్ గంభీర్ స్థానంలో మరొకరిని తెస్తున్నారన్నది కొందరి కల్పితం మాత్రమే," అని ఆయన స్పష్టం చేశారు.
ఏది ఏమైనా, గంభీర్ కోచింగ్‌లో భారత టెస్ట్ జట్టు వరుస ఓటములను చవిచూస్తుండటం ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. మరి గంభీర్ తన విమర్శకుల నోళ్లు మూయిస్తారో లేక కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటారో చూడాలి.