టైటిల్ భారత్‌దైతే.. ట్రోఫీ నఖ్వీదా? మరోసారి వివాదం తప్పదా?
మహిళల టీ20 ఆసియా కప్ 2026 చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ క్రికెట్ వర్గాల్లో సరికొత్త ఉత్కంఠ నెలకొంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా వరుసగా మూడు విజయాలు సాధించి లీగ్ దశలోనే సెమీఫైనల్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. భారత జట్టు ప్రస్తుతం ఉన్న పటిష్టమైన ఫామ్‌ను చూస్తుంటే టైటిల్ గెలుచుకోవడానికి ప్రధాన పోటీదారుగా కనిపిస్తోంది. అయితే మ్యాచ్‌లతో పాటు సెప్టెంబర్ 13న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగబోయే అవార్డుల ప్రధానోత్సవంపై కూడా అందరి దృష్టి పడింది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ఈ ఫైనల్ పోరుకు ముఖ్య అతిథిగా హాజరైన ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు ట్రోఫీని అందజేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొహ్సిన్ నఖ్వీ ఏసీసీ అధ్యక్షుడిగానే కాకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరి టైటిల్ సాధిస్తే మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా విజేత ట్రోఫీని స్వీకరిస్తుందా లేదా అనే సస్పెన్స్ అందరిలోనూ మొదలైంది.

ఈ ఆందోళనల వెనుక గతేడాది పురుషుల టీ20 ఆసియా కప్‌లో జరిగిన నాటకీయ పరిణామాలే కారణం. గతేడాది ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్తాన్‌ను ఓడించి ఆసియా కప్ గెలుచుకుంది. ఆ సమయంలో మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా విజేత ట్రోఫీని, పతకాలను స్వీకరించేందుకు భారత జట్టు స్పష్టంగా నిరాకరించింది. టీమిండియా ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులను మాత్రమే అందుకని ప్రధాన విజేత ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ నుంచి తీసుకోకుండా దూరంగా ఉండిపోయారు.
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన మొహ్సిన్ నఖ్వీ విజేత ట్రోఫీని తీసుకుని స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ ట్రోఫీని తిరిగి పొందడానికి బీసీసీఐ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ.. ప్రస్తుతం అది ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలోనే ఉండిపోయింది. ఇప్పుడు మహిళల ఆసియా కప్ ముగింపు దశకు చేరడంతో మరోసారి అలాంటి వివాదాస్పద ఘట్టమే స్టేడియంలో రిపీట్ అవుతుందా అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి.
మహిళల టీమిండియా ఇంకా ఫైనల్లో తమ స్థానాన్ని అధికారికంగా సాధించాల్సి ఉంది. అయితే ప్రస్తుత విజయాల వేగాన్ని బట్టి భారత్ ఖచ్చితంగా ఫైనల్ చేరుతుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఒకవేళ భారత్ టైటిల్ గెలిస్తే ట్రోఫీ ప్రదానోత్సవంలో భారత ఆటగాళ్ల నిర్ణయం ఎలా ఉంటుంది వారు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకుంటారా లేదా అనేది క్రీడా ప్రపంచంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


