ఆసియా కప్ ట్రోఫీకి సంబంధించిన వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఆ సార్ విజేతగా నిలిచిన టీమిండియాకు ఇవ్వాల్సిన ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ అబుదాబిలో లాక్ చేసి ఉంచడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలైన ట్రోఫీ దుబాయ్‌లోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో ఉన్నప్పటికీ.. విజేతలకు అందించే రెప్లికా ట్రోఫీని నఖ్వీ తన ఆధీనంలో ఉంచుకోవడం వివాదాన్ని మరింత రాజేసింది.
బీసీసీఐక తీవ్ర అభ్యంతరం.. ఐసీసీకి వెళ్తామని వార్నింగ్
మొహ్సిన్ నఖ్వీ వైఖరిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రోఫీని వెంటనే భారత జట్టుకు విడుదల చేయకపోతే ఈ వివాదాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి తీసుకెళ్తామని బీసీసీఐ హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్రోఫీ అందించడంలో జరిగిన సాధారణ ఆలస్యం ఇప్పుడు ఇరు బోర్డుల మధ్య పూర్తిస్థాయి అధికార వివాదంగా మారడం, ఆసియా క్రికెట్ పవర్ స్ట్రక్చర్‌లో ఉన్న ఉద్రిక్తతలను బహిర్గతం చేసింది.

నఖ్వీ షరతులు
ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై స్పందిస్తూ మొహ్సిన్ నఖ్వీ బీసీసీఐకి ఓ ఇ-మెయిల్ పంపినట్లు సమాచారం. ఆ మెయిల్‌లో ట్రోఫీని అందించేందుకు తాను సిద్ధమని.. అయితే బీసీసీఐ ప్రతినిధులు, అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు ట్రోఫీని అందజేసేందుకు ఓ ప్రత్యేక వేడుకను నిర్వహించవచ్చని మొహ్సిన్ నఖ్వీ సూచించారు.
మొహ్సిన్ నఖ్వి తన సమాధానంలో ఈ విధంగా పేర్కొన్నారు. "ఆసియా కప్ ట్రోఫీ భారత క్రికెట్ జట్టుకు చెందుతుంది. బీసీసీఐ ఆఫీస్ హోల్డర్‌తో పాటు పాల్గొన్న ఏ ఆటగాడైనా ఏసీసీ అధ్యక్షుడి నుంచి దానిని తీసుకునే వరకు అది అలాగే ఉంచబడుతుంది. మనం ప్రేమించే ఆట స్ఫూర్తిని దెబ్బతీయకుండా గొప్ప ఆడంబరం, కవరేజీతో కూడి ఉండాలి." అని నఖ్వీ వెల్లడించారు. నఖ్వి ఈ ప్రకటన ద్వారా ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించడం ద్వారా భారత జట్టు పాత సంప్రదాయాన్ని ఉల్లంఘించిందని పరోక్షంగా సూచించినట్లుగా తెలుస్తోంది.
వివాదానికి దారితీసిన సంఘటన
ఈ మొత్తం వివాదానికి మూల కారణం 2025 సెప్టెంబర్ 29న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ పురుషుల టీ20 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ విజయం సాధించినప్పటికీ.. భారత జట్టు ఆటగాళ్లు ట్రోఫీ, విజేత మెడల్స్‌ను మొహ్సిన్ నఖ్వి చేతుల మీదుగా స్వీకరించడానికి నిరాకరించారు. మొహ్సిన్ నఖ్వి పీసీబీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్, పీసీబీ చీఫ్‌కు మధ్య ఉన్న రాజకీయ, క్రికెట్ ఉద్రిక్తతల కారణంగానే ఆటగాళ్లు ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించినట్లు సమాచారం. ఈ నిరాకరణతో మొదలైన వివాదం ఇప్పుడు ట్రోఫీని లాక్ చేసి ఉంచడం, బీసీసీఐ హెచ్చరికలతో పూర్తిస్థాయి అంతర్జాతీయ క్రికెట్ పోరుగా మారింది.