టీ20లో 300 రన్స్: ఎవరీ మోహిత్?, ఢిల్లీ డేర్ డెవిల్స్ బంపర్ ఆఫర్
హైదరాబాద్: మంగళవారం ఫ్రెండ్స్ ఎలెవన్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల మోహిత్ అహ్లావత్ 300 పరుగులు సాధించి ప్రపంచ రికార్డుని నెలకొల్పి రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయ్యాడు. 72 బంతుల్లో 29 సిక్సర్లు, 18 ఫోర్ల సాయంతో 300 పరుగులు చేశాడు. దీంతో టీ20లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన మోహిత్‌ను తమ జట్టులో చేర్చుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ ముందుకొచ్చింది.
బుధవారం ట్రయల్స్‌కు రావాల్సిందిగా ఆహ్వానాన్ని పంపింది. మోహిత్ అహ్లావత్ ఆటను ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవడంపై కోచ్ సంజయ్ భరద్వాజ్ సంతోషం వ్యక్తం చేశారు. కోచ్ సంజయ్ మాట్లాడుతూ 'మోహిత్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. తన కలలను నెరవేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ అతడి ఆటను పరిగణనలోకి తీసుకోవడంపై చాలా సంతోషంగా ఉంది' అని అన్నాడు.
అంతేకాదు ట్రయల్స్ సందర్భంగా మోహిత్ తప్పకుండా ఢిల్లీ జట్టు ప్రాంఛైజీని సంతృప్తి పరుస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోహిత్ మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మన్, మించి వికెట్ కీపర్‌గా కూడా అద్భుతంగా రాణిస్తాడని కోచ్ సంజయ్ పేర్కొన్నారు. కాగా, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, భారత మాజీ అండర్ 19 జట్టు కెప్టెన్ ఉన్ముక్ చంద్ వంటి ఆటగాళ్లు సంజయ్ వద్దే శిక్షణ పొందారు.

ఏడాదిన్నర క్రితం ఢిల్లీ జట్టు తరఫున రంజీ మ్యాచ్
మోహిత్ ఎవరో కాదు... దాదాపు ఏడాదిన్నర క్రితం ఢిల్లీ జట్టు తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగేందుకు సిద్ధమైన సమయంలో ఆ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అడిగాడు. వికెట్ కీపర్‌గా జట్టులోకి అడుపెట్టాడు. పానిపట్‌కు చెందిన ట్రక్‌డ్రైవర్ కొడుకైన మోహిత్ 2015-16 రంజీ సీజన్‌లో ఢిల్లీ తరుపున మూడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.

మూడు మ్యాచుల్లో 5 పరుగులే
ఈ మూడు మ్యాచుల్లో అతడు చేసింది కేవలం 5 పరుగులే. ఇందులో మూడు డకౌట్లు కూడా ఉండటంతో మరో అవకాశం ఆడే అవకాశం రాకుండానే కనుమరుగయ్యాడు. అయితే తాజాగా ఫ్రెండ్స్ ప్రెమీయర్ లీగ్‌లో భాగంగా మావి ఎలెవెన్, ఫ్రెండ్స్ ఎలెవెన్ జట్ల మధ్య మంగళవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో 300 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.

12 బంతుల్లోనే 50 పరుగులు చేసిన మోహిత్
18 ఓవర్ వద్ద మోహిత్ వ్యక్తిగత స్కోరు 250. ఆ తర్వాత 12 బంతుల్లోనే మోహిత్ 50 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది 34 పరుగులు సాధించాడు. దీంతో మావీ లెవన్ 416 పరుగులు చేసింది. ఆ తర్వాత 417 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఫ్రెండ్స్ లెవన్ 216 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

తొలి బంతి నుంచే దూకుడుగా ఆడా
మ్యాచ్ అనంతరం మోహిత్ మాట్లాడుతూ ‘తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలని ముందే నిర్ణయించుకొని ఎదురుదాడికి దిగాను. అన్నీ బాగా కలిసి రావడంతో పరుగులు వరదలా పారాయి. మరో ఐదు ఓవర్లు ఉన్న సమయంలో 200కు చేరాను. మరింత దూకుడుగా ఆడుతూ బ్యాటింగ్ చేయాలని అప్పుడు నిర్ణయించుకున్నాను. 300 పరుగుల కోసం ప్రయత్నిస్తానని నా సహచరుడితో చెప్పాను' అని మోహిత్ పేర్కొన్నాడు.

జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యం
‘గౌతీ భాయ్ నా ప్రదర్శన గురించి తెలుసుకొని ఉంటారని ఆశిస్తున్నా. అయితే ఈ ఒక్క మ్యాచ్ నాకు ఐపీఎల్ అవకాశం ఇప్పిస్తుందా అనేది చెప్పలేను' అని మోహిత్ చెప్పాడు. జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని చెప్పాడు. తాజాగా వేలం కోసం అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితాలో మోహిత్ పేరు కూడా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications